శాసనసభలో ప్రశ్నోత్తరాల సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి హరీష్ రావు సమాధానం ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సందర్భంగా వెంటనే పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టుల విషయంలో శ్రద్ధ చూపించలేదని, కొత్త టెండర్లు పిలవాలంటే లీగల్ సమస్యలు ఉన్నాయని, రీ ఇంజినీరింగ్ తర్వాత 29 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ విషయం రీ డిజైనింగ్ లో పరిశీలిస్తామని, ఖమ్మం జిల్లా ప్రజల బాధలు ప్రభుత్వానికి తెలుసని, ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరానికీ నూటికినూరు శాతం సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని హరీష్ రావు పేర్కొన్నారు.
రైతు బంధు పథకాన్ని రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ వర్తింపజేస్తామని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఎరువుల కొరత దృష్టిలో పెట్టుకుని గోదాంలు నిర్మిస్తున్నామని, రూ. 1024 కోట్ల వ్యయంతో గోదాంలు నిర్మిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఖరీఫ్ కంటే ముందే గోదాంల నిర్మాణం పూర్తి చేస్తామని, గోదాంల నిర్మాణానికి స్థలం సేకరించడం పూర్తయిందని వెల్లడించారు. స్థలం దొరక్క కొన్నిచోట్ల నిర్మించలేదని, స్థలం దొరికితే వాటి నిర్మాణానికి కూడా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రైతులు తాము పండించిన పంటకు ధర రాకపోతే ఈ గోదాముల్లో దాచుకోవచ్చని, సరైన ధర వచ్చినప్పుడు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చని తెలిపారు. రైతు తనకు కావాల్సివస్తే ధాన్యంకు బదులు రూ. 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చని, ధర వచ్చినప్పుడు ఒక్క పైసా వడ్డీ లేకుండా రుణం చెల్లించి ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చని కూడా మంత్రి వివరించారు.