శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు మళ్ళీ రైతు సమస్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. విపక్షాలు స్పీకర్ పోడియం ముందు బైఠాయించి చర్చ జరపాల్సిందేనంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ మాట్లాడుతూ సభను జరగకుండా అడ్డుకోవడం మంచిదికాదని, ఇప్పటికే రైతు సమస్యలపై బీఏసీలో నిర్ణయించిన ప్రకారం 13 గంటలపాటు చర్చ జరిగిందని, దయచేసి ఎవరిసీట్లలో వారు కూర్చోవాల్సిందిగా కోరారు. అయినా ప్రతిపక్ష సభ్యులు వినకుండా నినాదాలు చేయడంతో సభ సజావుగా సాగాలంటే ఆందోళన చేస్తున్న సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. సభ తీర్మానాన్ని ఆమోదించడంతో కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ఎంఐఎం సభ్యులు మినహా మిగతా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైసీపీ సభ్యులను సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.