హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీమంత్రి జీ వెంకటస్వామి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, స్పీకర్ మధుసూదనాచారి, కాకా కుమారులు వినోద్, వివేక్ లతో పాటు పలువురు కాకా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాకా విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, వెంకటస్వామి రాజకీయ భీష్ముడని, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం ఉన్న నిజమైన తెలంగాణ బిడ్డ అని ప్రశంసించారు.
తెలంగాణ కోసం కాకా అహర్నిశలు కృషి చేశారని, ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బులెట్ దెబ్బ తగిలినా భయపడకుండా ముందుకు వెళ్ళారని, చిన్నస్థాయి నుండి మనిషి పెద్ద స్థాయికి ఎదగగలడని చెప్పేందుకు వెంకటస్వామి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు. ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదిగిన దళిత నేత కాకా అని, పేదలకోసం, దళితుల కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు.