తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయడానికి అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఫైలుపై గవర్నర్ గురువారం సంతకం చేశారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని లక్షల ఖాళీలు భర్తీ చేసేందుకు, కొత్తగా నియామకాలు జరుపుకునేందుకు వీలు కలుగుతుంది. ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులతో బుధవారం జరిగిన సమావేశం అనంతరం గవర్నర్ ఫైలుపై ఆమోదముద్ర వేశారు. శుక్రవారం లేదా శనివారం ఈ అంశానికి సంబంధించి జీవో జారీ అయ్యే అవకాశం ఉంది.
జూన్ రెండున తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది రోజులకే టీఎస్‌పీఎస్సీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్ ను కలిశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ప్రతీ రాష్ట్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చని, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 83, సబ్ క్లాజ్(2) లో కూడా టీఎస్‌పీఎస్సీని ఏర్పాటు చేసుకునేందుకు నిబంధనలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి కూడా లేఖ వ్రాశారు.
రెండు నెలల తర్వాత రాష్ట్ర గవర్నర్ నుండి అనుమతి లభించడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సీ విఠల్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చొరవ వల్లే ఇంత తొందరగా టీఎస్‌పీఎస్సీ ఏర్పడుతోందని, దీనివల్ల నిరుద్యోగ యువకుల ఆందోళనలకు గవర్నర్ నిర్ణయంతో సమాధానం లభించిందని దేవీప్రసాద్ అన్నారు.