శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ హైదరాబాద్ లోగోను, సీడీని కూడా వారు ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలోని 425 యూనిట్ల మెంటర్లు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొననున్నారు. కార్యక్రమం పూర్తికాగానే ఆయా విభాగాలకు మెంటర్లుగా నియమితులైన వారు వారివారి విభాగాలకు వెళ్లి స్థానిక కాలనీ వాసులు, స్వచ్ఛ యూనిట్ సభ్యులతో సమావేశమై చర్చిస్తారు. ఈనెల 17 నుండి పూర్తిస్థాయి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా చెత్త, చెదారం తొలగించి రోడ్లపై గుంతలను పూడుస్తారు. డ్రెయిన్, ఫుట్ పాత్ లకు మరమ్మతులు చేయడం, మ్యాన్ హోల్స్ మూసివేయడం లాంటివి చేస్తారు. చెత్త, చెదారం మళ్ళీ పేరుకుపోకుండా ప్రజల్లో మార్పుతెచ్చేలా చైతన్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం సుమారు 1.5 నుండి 2 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో ఒక్కో యూనిట్ ను ఏర్పాటు చేశారు. ప్రతి యూనిట్ లో పారిశుధ్య కార్యక్రమాన్ని పాట్రన్ తో పాటు బిల్ కలెక్టర్, వాటర్ వర్క్స్ అధికారి, పోలీస్ అధికారి, రెవెన్యూ అధికారి, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, విద్యుత్ శాఖ అధికారి, నోడల్ అధికారులతో పాటు స్థానికులైన 15 మంది ప్రముఖులు పర్యవేక్షిస్తారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 9వ సర్కిల్ లోని పార్శీగుట్ట పాట్రన్ గా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 10వ సర్కిల్ లోని ఆనంద్ నగర్ యూనిట్ పాట్రన్ గా ఉంటారు. సుమారు 36 వేల మందితో ఈ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 6వేలమంది స్థానికులు ఇందులో పాల్గొననున్నారు. 25 టన్నుల సామర్ధ్యం గల 76 వాహనాలను, 34 జేబీసీలు, 35 డంపర్ ప్లేసర్లను వినియోగించనున్నారు. స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ పై వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. అంతేకాకుండా 500 మంది కళాకారులు ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. సినీ, క్రీడా కళాకారులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.