తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనాన్ని రూ.15,600గా నిర్ధారించింది. గతంతో పోల్చితే ఇది సుమారు 50 శాతం ఎక్కువ. కాగా ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. ఈ మేరకు వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్’ (ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్) ఈ ఏడాది మార్చిలో నూతన విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఒక్కో బెడ్‌కు పారిశుద్ధ్య నిర్వహణ చార్జీలను 50 శాతం పెంచిన క్రమంలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచుతూ.. రూ.15,600 కనీస వేతనంగా నిర్ధారించింది. అలాగే వీరికి ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలని ఆదేశించింది. ఇందుకోసం కార్మికుల తరఫున రూ.1,542, ఏజెన్సీ తరఫున రూ.1,965 చెల్లిస్తారు. ఇవి మినహాయించి రూ.12,093 కార్మికుల ఖాతాలో వేయనున్నారు.
50 శాతం పెరుగనున్న వేతనాలు
గతంలో పారిశుద్ధ్య కార్మికులకు రూ.10,700 వేతనం చెల్లించేవారు. ఇందులో పీఎఫ్, ఈసీఐ పోను కార్మికులకు రూ.8,400 ఇచ్చేవారు. ప్రభుత్వం నిర్వహణ చార్జీలు 50శాతం వరకు పెంచిన నేపథ్యంలో.. వారి వేతనాలు ఆ మేరకు పెరుగనున్నాయి. ‘ప్రభుత్వం శానిటేషన్ చార్జీలు పెంచింది. దీనికి తగ్గట్టే మీ వేతనాలు పెరుగుతాయి. కాబట్టి దవాఖానకు వచ్చే రోగులతో ఆప్యాయంగా వ్యవహరించండి. డబ్బులు వసూలు చేయడం మానేయండి’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పదే పదే పారిశుద్ధ్య కార్మికులకు సూచిస్తున్నారు. ఈ మేరకు వేతనాల పెంపుతోపాటు నిబంధనలను కఠినతరం చేశారు. గతంలో నిర్దేశించిన దానికన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ సారి నేరుగా వారి ఖాతాల్లోనే వేతనాలను జమచేసేలా చర్యలు తీసుకున్నారు.