లంగర్ హౌస్ లోని గోల్కొండ కోటలో ఆషాడమాస బోనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇక్కడ బోనాలు ప్రారంభం అయ్యాకే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, పాతబస్తీ, రాష్ట్ర వ్యాప్త బోనాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండ కోటలోని మహంకాళి అమ్మవారికి రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు కలిసి మొదటి పూజ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పద్మారావు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ బోనాల పండుగ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం ఘనంగా కృషి చేస్తుందని, ఇందుకు అవసరమైన నిధుల విడుదలకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం మంత్రి పద్మారావు మాట్లాడుతూ వర్షాలు పడి ప్రజలకు తాగు, సాగునీరు లభించాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ జీ సోమేశ్ కుమార్, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కోయల్ కార్ గోవిందరాజ్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.