mt_logo

విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ!

తెలంగాణలోని విశ్వ విద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం సంతకం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ పెన్షనర్లందరికీ గ్రాట్యుటీని రూ. 8 లక్షలనుండి రూ. 12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటికి సంబంధించి జీవోలు, మార్గదర్శకాలు సోమవారం వెలువడనున్నాయి. రాష్ట్రంలోని 13 వర్సిటీలకు చెందిన 15 వేలమంది బోధనేతర సిబ్బంది పదో పీఆర్సీ కోసం ఆరునెలలుగా ఎదురుచూస్తున్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఇవి సాహసోపేతమైన నిర్ణయాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు జీ దేవీప్రసాద్, టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి తదితరులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం అన్ని వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పక్షాన సంబరాలు జరుపుకుంటామని, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటామని తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర సిబ్బంది జేఏసీ చైర్మన్ మనోహర్ తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోధనేతర సిబ్బంది అసోసియేషన్ కార్యదర్శి జయరామ్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన నిజామాబాద్ ఎంపీ కవిత, వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉండగా వర్సిటీలలోని బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల అంబేద్కర్ యూనివర్సిటీ ఉద్యోగుల జేఏసీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎం నిర్ణయం ఎంతో ఆనందకరమని యూనివర్సిటీ జేఏసీ నాయకులు ఏ మోహన్, కృష్ణ, జీ మహేష్ గౌడ్, శంకరాచారి తదితరులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *