రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ… ‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం. ఒకనాడు అనేక సమస్యలతో తాగు, సాగునీటికి, కరెంటు, మెడికల్ సీట్లు, ఇంజినీరింగ్ సీట్లకు ఎన్నో రకాల అవస్థలుపడ్డ తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రమై అద్భుతంగా ఆత్మగౌరవంతో బతుకుతూ దేశానికే మార్గదర్శకమైనటువంటి అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నాం. మనం ఇవాళ ఎనిమిది కళాశాలలను ప్రారంభించుకోవడం అందరికీ గర్వకారణం’ అన్నారు.
‘గతంలోనే మనం ప్రభుత్వ రంగంలో నాలుగు కళాశాలను స్థాపించుకున్నాం. మహబూబ్‌నగర్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేటలో గతంలో నాలుగు ప్రారంభించాం. అవన్నీ మెడికల్ ఎడ్యూకేషన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఇవాళ మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రారంభించుకుంటున్నాం. మహబూబాబాద్, వనపర్తిలాంటి మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలలు, వైద్య కళాశాలలు వస్తాయని ఎవరూ కలలో ఊహించలేదు. వీటన్నింటికి కారణం సొంత రాష్ట్రం ఏర్పాటు కావడం. సొంత రాష్ట్రం ఏర్పాటుతో ఉద్యమకారులుగా పని చేసిన బిడ్డలే తెలంగాణ పరిపాలనా సారథ్యం స్వీకరించడం, అందులో ప్రముఖ ఉద్యమకారుడు, మంత్రి హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖను నిర్వహిస్తూ కళాశాలలను తీసుకువచ్చేందుకు చేసిన కృషి అపూరపమైంది. మంత్రి హరీశ్‌రావును అభినందిస్తున్నాను. మంత్రికి పూర్తిగా సహకరించిన సీఎస్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డి, ఇతర వైద్య శాఖల అధికారులు, సిబ్బంది అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్న. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ రావాలని మనం సంకల్పించుకున్నాం’ అన్నారు.
‘ప్రభుత్వరంగంలో మెడికల్ కాలేజీ సంఖ్య 17కు పెరిగింది. ఇంకో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలో ప్రారంభించుకోవాల్సి ఉంది. రాబోయే రోజుల్లో విశేష కృషి చేసి పూర్తి చేస్తాం. ఈ ఏడాది, వచ్చే సంవత్సరం 17 కాలేజీలను ప్రారంభించుకుందాం. భగవంతుడు మన్నిస్తే నేనే వాటికి ప్రారంభోత్సవం చేస్త. గతంలో 850 మెడికల్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉండేవి. ప్రస్తుతం ఎకాఎకీన 2,790 సీట్లకు పెరిగింది. ఇప్పటి వరకు దాదాపు నాలుగు రెట్లు సీట్లు పెరుగడం సంతోషం. పీజీ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సీట్లు గతంలో పోలిస్తే గణనీయంగా పెంచుకోగలిగాం. గతంలో కేవలంలో రాష్ట్రంలో 515 పీజీ సీట్లు ఉంటే.. ఇప్పుడు 1180 సీట్లు అందుబాటులోకి వచ్చేవి. గతంలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 70 మాత్రమే ఉంటే.. ప్రస్తుతం 152 వరకు అందుబాటులోకి వచ్చాయి. సీట్ల పెంపుతో విద్యార్థులకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి’ అన్నారు.
‘రెసిడెన్షియల్ కళాశాలల నుంచి వస్తున్న రత్నాల్లాంటి, వజ్రాలంటి విద్యార్థులు నీట్‌లో సీట్లు సాధిస్తున్నారు. ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు బలహీన బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ఇదో మంచి అవకాశం. ఇందుకు కృషి చేసిన రమేశ్‌రెడ్డికి, అధికారులకు ధన్యవాదాలు. మెడికల్ సిబ్బంది, జనాభా నిష్పత్తికి సరితూగే డాక్టర్లు ఉండడం ఎంత అవసరమో దానికి తగు రీతిలో పారామెడికల్ సిబ్బంది, రెడియాలజిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషన్లు తదితర వైద్య సహాయక సిబ్బంది తగుమోతాదులో ఉండాలి. దాన్ని కూడా నిర్లక్ష్యం చేకుండా ఉండాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సిబ్బంది నియామకానికి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 33 జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కళాశాలలు యూనిఫాంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా పారామెడికల్ కోర్సులు అన్ని చోట్ల పెట్టకపోయినా.. వరంగల్ లాంటి ప్రముఖ ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్క కోర్సు ఉండేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో ఏ మారుమూల అయినా మనదే. యావత్ తెలంగాణ అభ్యుదయం జరగాలి’ అన్నారు.
రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ.. ఆ ఊరు తేడా లేకుండా.. చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంచు మనదే అని ఉద్విగ్నమైన భావనతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో రూపంగానే కనిపించేది మిషన్ భగీరథ. దీంతో ప్రతి ఇంటికి నీరు వస్తుంది. మిషన్ కాకతీయతో ప్రతి ఊరి చెరువు బాగుడుపతది. ఒకే నియోజకవర్గం, గిరిజన ప్రాంతాలైన ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వెలుగులు రావాలని మెడికల్ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతి జిల్లాకు వస్తే.. మారుమూల ప్రాంతాల్లోని వారికి మంచి అవకాశాలు వస్తాయి, బాగుంటుంది. గతంలో విపత్కర పరిస్థితులు చూశాం. కరోనా సమయంలో ప్రపంచమంతా గజగజ వణికిపోయింది. ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఉన్న అమెరికాలో లక్షాది మంది వైద్యసదుపాయాలు కొరవడి మృత్యువాతపడడం కళ్లారా చూశాం. మనం కూడా నష్టపోయాం’ అన్నారు.
‘రాబోయే రోజుల్లో అనేక రకాల వైరస్‌లు పట్టిపీడిస్తాయని కరోనా సమయంలో ఎంటమాలజిస్ట్‌లు చెప్పారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఏ రాష్ట్రంలో, దేశంలో వైద్య వ్యవస్థ పటిష్టంగా వాళ్లకు తక్కువ నష్టాలు సంభవిస్తాయ్. ఎక్కడ లోపభూయిష్టంగా ఉంటుందో ఎక్కువ నష్టాలు వచ్చి.. మానవ సంపద నష్టపోతదని ఎంటమాలజిస్ట్‌లు చెప్పారు. ఆర్థికవనరులు, అన్ని రకాల వనరులను పెంచుకుంటూ దేశానికే మార్గదర్శకంగా, అభ్యుదయపథంలో పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మహమ్మారులు, వైరస్‌ల బెడద రావొద్దని, మీరంతా విద్యావంతులై అద్భుతంగా ప్రజలను కాపాడి, విద్య పనికి రావాలని, ముందుకెళ్లాలన్నారు. వైద్య విధానం పటిష్టవంతమై ఎలాంటి వైరస్‌లు, కరోనాలాంటి మహమ్మారులు వచ్చినా అందరికీ రక్షణగా ఉండే గొప్ప వైద్య కవచాన్ని విద్యార్థుల రూపంలో చేసుకోవాలని బృహత్ ప్రయత్నానికి శ్రీకారం చుట్టాం. గొప్ప ఆశయంతో సామాజిక భద్రత, సమాజ శ్రేయస్సు, ముఖ్యంగా పేదల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వేలకోట్లు పెట్టుబడి పెడుతూ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మిస్తుంది’ అన్నారు.
‘భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, ఆరోగ్య పరిరక్షణకు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. ఏ సమస్యలు వచ్చినా మంత్రిని సంప్రదించి కళాశాలల్లో లోపం లేకుండా ముందుకు తీసుకెళ్లాలి. మనం తీసుకున్న పాలసీని దేశం అనుసరిస్తుంది. వైద్యరంగంలో తెలంగాణను అనుకరించే పద్ధతికి రాష్ట్రం ఎదగడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో బోధనా సిబ్బంది, కళాశాలల యాజమాన్యం పూర్తి తదేక దీక్షతో వైద్య విద్య కార్యక్రమాన్ని కొనసాగించాలి. విద్యార్థులు సంపాదించే జ్ఞానం తెలంగాణ ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడాలి. ఇంకా ఎన్ని వందల కోట్లానా వెచ్చిందేకు సిద్ధంగా ఉన్నాం.
ప్రజల ఆరోగ్య రక్షణ ప్రభుత్వ బాధ్యత, ఇందుకు ఎంత ఖర్చయినా వెచ్చించేందుకు వెనుకాడం. పారామెడికల్ కాలేజీల్లో వెంటనే కోర్సులను ప్రారంభించాలని చూడాలని మంత్రిని కోరుతున్నా. అందరికీ అవకాశాలు వచ్చేలా పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా మంత్రి, సీనియర్ అధికారులు పర్యవేక్షించాలి. ప్రధాన కళాశాల భవనాలు నిర్మాణంలో వేగంగా పూర్తి చేయాలి. అందరూ సమన్వయంతో పని చేసి వైద్య, విద్యారంగంలో మంచి పేరును తెచ్చేలా ముందుకు వెళ్లాలి. భారతదేశంలో చరిత్రలో ఒక్క రాష్ట్రంలో, ఇంత తక్కువ సమయంలో ఒకే రోజు ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అరుదైన సందర్భం’ అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.