సోమవారం రవీంద్రభారతిలో మద్య నిషేధ, అబ్కారీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖామంత్రి టీ పద్మారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరణించిన, శాశ్వత వికలాంగులైన 41 మంది కుటుంబాలకు రూ. 35లక్షల చెక్కులు అందజేశారు. తాత్కాలికంగా వికలాంగులైన మరో 1524 మంది కార్మికులకు రూ. 10వేల చొప్పున అందించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తిదారులు, గౌడ కులస్థులు కల్తీ జోలికి వెళ్ళకుండా తన పరువును, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను తెరిపించారని, గత పాలకులు ఐదేళ్ళు నష్ట పరిహారం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తే మన ముఖ్యమంత్రి అడగ్గానే ఆరున్నర కోట్ల నష్ట పరిహారాన్ని మంజూరు చేశారని అన్నారు.
వృత్తి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే కల్లు గీత కార్మికులకు చెల్లించే ఆర్ధికసాయాన్ని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని భావిస్తున్నట్లు, ఈ ప్రతిపాదనను త్వరలో సీఎం కేసీఆర్ ముందు ఉంచుతానని పద్మారావు తెలిపారు. గుడుంబా తయారీదారులు, పన్ను చెల్లించని లిక్కర్ వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. గీత కార్మికులకు, గౌడ సోదరులకు ఎల్లవేళలా తాను అందుబాటులో ఉంటానని, అండగా నిలుస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారంలో ఎలాంటి జాప్యం లేకుండా 15నుండి నెలలోపు ఇస్తామని, అబ్కారీ శాఖలో పెండింగ్ ప్రమోషన్లు త్వరలో ఇప్పిస్తామని మంత్రి పద్మారావు భరోసా ఇచ్చారు.
మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ఆర్ధికసాయం అందిస్తున్న సమయంలో మంత్రి పద్మారావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను గీత కార్మికుడిగా ఎన్నో కష్టాలు పడ్డానని, హైద్రాబాద్‌లో కల్లును నిషేధించినప్పుడు భారీగా నష్టపోయానని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయానని, గీత కార్మిక కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్ గ్రేషియాను ఐదేళ్ళపాటు ఆపారని కంటతడి పెట్టుకున్నారు. ఈ సమావేశంలో శాసనమండలి స్పీకర్ స్వామిగౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అబ్కారీ శాఖ కమిషనర్ ఆర్‌వీ చంద్రవదన్ తదితరులు పాల్గొన్నారు.