ఈరోజు ఉదయం నాగార్జునసాగర్ లో టీఆర్ఎస్ పార్టీ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. విజయవిహార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్, కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి లింగ్డో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రముఖ ఆర్ధికవేత్త హనుమంతరావు మాట్లాడుతూ, 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ అడుగడుగునా దోపిడీకి గురైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం చాలా అద్భుతమైన కార్యక్రమమని, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందరికీ అందిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు. పంచాయితీ రాజ్ వ్యవస్థ బలోపేతంతోనే గ్రామాలు బాగు పడతాయని, నేటి సమాజంలో ఐటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని, అందుకు అనుగుణంగా అందరూ ముందుకు వెళ్ళాలని సూచించారు. అనంతరం లింగ్డో మాట్లాడుతూ, ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట పడినప్పుడే గుడ్ గవర్నెన్స్ సాధ్యమని, సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికైన వారికి మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. అమెరికాలో ప్రజా ప్రతినిధులకు ఎక్స్ పర్ట్స్ సహాయం చేస్తుంటారని, అందుకే వాళ్ళు సక్సెస్ ఫుల్ గా పని చేస్తున్నారని తెలిపారు.
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, సమైక్య పాలకుల వివక్షను తట్టుకోలేక తెలంగాణ ఉద్యమం చేశామని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమ రాష్ట్రంగా తయారు కావాలని సీఎం చెప్పారు. శిక్షణా తరగతుల వల్ల ఎంతో ఉపయోగం ఉందని, ఇక్కడి సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇది పరస్పర అభిప్రాయాలు పంచుకునే వేదికని, వాస్తవానికి ఎప్పుడో ఈ పని చేయాల్సింది గానీ పని ఒత్తిడి వల్ల ఆలస్యమైందని, ఇకపై ప్రతి ఆరునెలలకొకసారి శిక్షణా తరగతులను హైదరాబాద్ లో కేవలం ఒక్కరోజే ఏర్పాటు చేస్తామని అన్నారు. మనకు తెలిసింది కొంతేనని, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుందని, అంతా మనకే తెలుసని అనుకోవద్దని, ఎవరూ అన్ని రంగాల్లో నిష్ణాతులు కాలేరని, అది సాధ్యం కూడా కాదని అన్నారు.