By: సవాల్‌రెడ్డి:
ప్రతిపక్షాలు, సీమాంధ్ర మీడియా, స్వయం ప్రకటిత మేధావులు కలిసి ఉస్మానియా పునర్నిర్మాణాన్ని వివాదాస్పదం చేస్తున్నారు. సమైక్య ప్రభుత్వాలు హైదరాబాద్‌ను అడ్డికి పావుశేరు అమ్ముకుంటున్నప్పుడు, అనేక భవనాలు నేలమట్టం చేస్తున్నపుడు గుర్తుకు రాని హెరిటేజ్‌లు, కళాఖండాలు, తరతరాల చరిత్రలు ఇవాళ కొందరికి హఠాత్తుగా గుర్తుకు వస్తున్నాయి. చంద్రబాబు తన హయాంలో రహదారుల వెడల్పు పేరిట రాష్ట్రమంతా వేలాది పురాతన భవనాలు కూల్చినపుడు నోరు విప్పిన వాడు లేడు. నగరంలో లెక్కకు మిక్కిలి పురాతన భవనాలు రియల్ఎస్టేట్ ధనదాహానికి నేల కూలినపుడు కిమ్మన్నవాడు లేడు.
-కూల్చేసినపుడు నోరెత్తలేదేం?
-తరలించమని ధర్నాలు కూడా చేశారు
-ఆర్టీసీకి ఇవ్వాలంటూ పైరవీలకు దిగారు
-ఉస్మానియా విషయంలో గొంతు మార్చారు
-వేయిస్తంభాల ఆలయాన్నే మళ్లీ కట్టుకుంటున్నాం
-ఉస్మానియా పునర్నిర్మాణానికి అభ్యంతరమేంటి?
ఆ రోజు మాట మాట్లాడేందుకే గడగడలాడిన మేధావులు ఇవాళ ఉస్మానియా స్థానంలో అదే పేరుతో అంతకన్నా భారీ దవాఖాన కడతానంటే ఒంటికాలిమీద లేస్తున్నారు. పాత భవనం స్థానంలో కొత్త భవనం ప్రభుత్వ లక్ష్యం కాగా దాన్ని కేవలం కూల్చివేతగా చిత్రిస్తున్నారు. పెచ్చులూడుతున్నపుడు, శిథిలాలు రాలుతున్నపుడు, గోడల్లోంచి చెట్లు మొలుస్తున్నపుడు అటువైపు కన్నెత్తి కూడా చూడని నాయకులకు ఇపుడు ఉస్మానియా ఒక అపురూప అద్భుత కట్టడంగా కనిపిస్తున్నది. స్వయం ప్రకటిత మేధావులు, పాత్రికేయ దాదాగిరిలను వదిలేస్తే కాంగ్రెస్ బీజేపీ నాయకులు పోటీలు పడి చేస్తున్న ప్రకటనలు విస్మయం గొలుపుతున్నాయి. ఒకాయన చేతులు నరికేస్తానని బెదిరిస్తుంటే ఇంకొకరు నిరాహారానికి దిగుతానంటున్నారు.
గాంధీ దవాఖాన సంగతేంటి?
ఇవాళ ఉస్మానియా కోసం శివాలెత్తుతున్న వాళ్లు నగరంలో అంతకన్నా పురాతనమైన గాంధీ దవాఖానను తరలించినపుడు మాత్రం నోరెత్తలేదు. ఉస్మానియాతో పోలిస్తే గాంధీ దవాఖాన ఇంకా పురాతనమైంది. 1851లో సికింద్రాబాద్ ప్రాంతం బ్రిటిష్ సైన్యం ఆధీనంలో ఉండేది. ఆ కాలంలో సికింద్రాబాద్‌లో నివసించే బ్రిటిషర్ల కోసం కంటోన్మెంట్ హాస్పిటల్ పేరుతో పాశ్యాత్య, భారత నిర్మాణ శైలి మేళవించి దీన్ని నిర్మించారు. సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో మూడు వార్డులతో అది ప్రారంభమై 1900 నాటికి 95 పడకలస్థాయికి చేరింది. 1913లో బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ స్మారకార్థం ఈ ఆస్పత్రిని ఆధునీకరించి కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌గా నామకరణం చేశారు. ఆధునిక వైద్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ దవాఖానను స్వాతంత్రానంతరం బోధనాసుపత్రిగా రూపొందించి గాంధీ హాస్పిటల్‌గా పేరు మార్చారు. నగరంలోని దవాఖానల్లో తొలిసారి లిప్ట్ను ఇందులోనే ఏర్పాటు చేశారు. ఎన్నెన్నో పరిశోధనలకు ఈ దవాఖాన పేరుగాంచింది. హైదరాబాద్ ప్రజలకు ఉస్మానియా, లష్కర్ ఆ చుట్టుపక్క జిల్లాలకు గాంధీ అనే పేరుండేది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేది.
తరలింపు కోసం ఆందోళనలు..
ఇంత చరిత్ర కలిగిన ఈ దవాఖాను 2003వ సంవత్సరంలో పాత ముషీరాబాద్ జైలుకు తరలించారు. అయితే ఆనాడు ఈ తరలింపును అడ్డుకున్నవారు లేరు. వందల ఏండ్ల చరిత్ర ఉన్న భవనాన్ని పడగొట్టినపుడు హెరిటేజ్ అంటూ గుండెలు బాదుకున్న స్వయంప్రకటిత మేధావులు లేరు. వాస్తవంగా ఈ దవాఖానను తరలించాలని సుమారు 200 రోజులు భారీ ఆందోళనలు జరిగాయి. దవాఖాన ముందు సిబ్బంది నిరశన కార్యక్రమం చేపడితే అనేక రాజకీయ పక్షాలు పోటీపడి తరలివచ్చి మద్దతు పలికాయి. ఇవాళ ఉస్మానియా తరలించనివ్వం అంటున్న బీజేపీ ఆనాడు ఈ దవాఖాన ఖాళీ చేయించి ఆర్టీసి ఇవ్వాలని ఏకంగా ధర్నాలే చేసింది. నేటి కేంద్రమంత్రి బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ స్థలాన్ని ఆర్టీసీకి అప్పగించే బాధ్యతను నెత్తిన వేసుకుని చంద్రబాబు, వైఎస్ హయాంలో సీఎంల వద్దకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఈ విషయాన్ని వదిలి ఇపుడు బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఉస్మానియాను తరలించనివ్వం అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.
ముషీరాబాద్ జైలు సంగతేంటి?
బ్రిటిష్ కాలంలో స్వతంత్ర యోధులను బంధించిన అండమాన్ జైలును ప్రభుత్వాలు హెరిటేజ్‌గా ప్రకటించాయి. తెలంగాణ చరిత్రలో ముషీరాబాద్ జైలుది కూడా ఎన్నదగిన చరిత్రే. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ జైలులో బంధించిన ఉద్యమకారుల మీద ఆంధ్ర జైలు అధికారులు, ఖైదీలు జరిపిన క్రూరమైన దాడి ఆ రోజుల్లో తీవ్ర సంచలనానికి కారణమైంది. అనేక మంది ఉద్యమకారులు తీవ్రగాయాలతో హాస్పిటళ్ల పాలయ్యారు. ఎన్నో కథలు గాథలు ఈ జైలు చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అయినా ఆ జైలును సమైక్యపాలకులు ఒక్క జీవోతో నేలమట్టం చేసిన రోజున ఇదేమన్న పాపాన పోయిన వాడు లేడు. నోరెత్తడానికి సాహసించిన వాళ్లు అంతకన్నా లేరు.
ప్రతీదీ హెరిటేజేనా?
వందల ఏండ్లు చరిత్ర ఉన్న ఈ నగరంలో ప్రతి నిర్మాణమూ పురాతనమే. ఎప్పుడో మధ్య యుగాల్లో ఈ నగరాన్ని సందర్శించిన టావనీర్ వంటి పర్యాటకుడే ఈ నగరంలో ఎటు చూసిన పెద్దపెద్ద భవనాలు ఉన్నాయని రాసుకున్నాడు. ఈ నగరంలో భవనాలకు కొదువ లేదు. ప్రతి పురాతన భవనము కళాఖండం కాదు. ఫలక్‌నుమా కళా దృష్టితో నిర్మించిన భవనం. అది హెరిటేజ్ అంటే అర్థం. చార్మినార్ ఒక చారిత్రక విజయానికి ప్రతీక. దాని నిర్మాణం ఆ దృష్టితోనే జరిగింది. అది వారసత్వం. కానీ ఉస్మానియా రోగుల వైద్యం కోసం నిర్మించిన భవనం.
ఇందులో ప్రజలకు సౌకర్యం తప్ప కళకు తావు లేదు. ఇది కళాఖండం కాదు. రోగాలు రొష్టులతో వైద్యం పొందేందుకు ఉద్దేశించిన ఈ భవనం పర్యాటక ప్రదేశం కూడా కాదు. పర్యాటకులు ఇందులో చూసేందుకు వింతలు విడ్డూరాలు కూడా లేవు. శవాల గదిలో గోడలకు నిలబెట్టిన దిక్కులేని శవాలు తప్ప. ఇపుడు సమస్య ఏమిటంటే పురాతనం, హెరిటేజ్ అంటూ చూడాల్సి వస్తే నగరంలో ఏ ఒక్క భవనమూ ముట్టుకునే వీలే ఉండదు.
మరి ప్రజలకు అందుబాటులో ప్రజల సౌకర్యార్థం మంచి దవాఖాన ఎక్కడ కట్టాలి? మహామేధావులు కొందరు ఉస్మానియాలోనే ఖాళీ స్థలంలో కట్టాలని సలహాలిస్తున్నారు. మిల్లీ మీటర్లు.. సెంటీ మీటర్ల లెక్కలు చెప్తున్నారు. అయితే హెరిటేజ్ నిర్మాణం పక్కన దానికన్నా ఎత్తైన భవనం నిర్మించే వీలు లేదు. ప్రభుత్వం సంకల్పించిన స్థాయిలో బెడ్లు ఉండే నిర్మాణం జరుగదు. పైగా అక్కడ ఖాళీ స్థలంలో ఒకనాడు మూసీ వరదలనుంచి వేలాదిమందిని కాపాడిన చారిత్రక వృక్షం కూడా ఉంది. ఏదో రకంగా సర్దుకుని నిర్మించేందుకు ఇది షాపింగ్ మాల్ కాదు.. దవాఖాన!
ధ్వని కాలుష్యంనుంచి మొదలుకుని గాలి వెలుతురు వంటి అనేక అంశాలు చూడాల్సి ఉంటుంది. రోగులను సగం నయం చేసేది ఆహ్లాదకరమైన వాతావరణమే. రాష్ట్రానికే గర్వకారణమై వేల ఏండ్ల చరిత్ర కలిగిన వేయిస్తంభాల ఆలయాన్నే తొలగించి పునర్ నిర్మించుకుంటున్నపుడు ఉస్మానియా దవాఖానను తొలగించి అదే రీతిలో మరింత భారీగా కట్టుకుంటే అభ్యంతమేంటో అర్థంకాదు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..