mt_logo

తెలంగాణలో ప్రముఖ విదేశీ కంపెనీ థామ్సన్ పరిశ్రమ!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో పలు విదేశీ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా సుప్రసిద్ధ విదేశీ కంపెనీ థామ్సన్ ఇక్కడ టీవీల తయారీ పరిశ్రమ పెట్టడానికి ముందుకొచ్చింది. తాజ్ డెక్కన్ లో థామ్సన్ ఎల్ఈడీ ఉత్పత్తి సంస్థను రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్తులో తెలంగాణ పరిశ్రమలకు పెద్ద కేంద్రంగా మారనుందని, పారిశ్రామికాభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కృతనిశ్చయంతో ఉన్నారని, భారీ ఎత్తున పరిశ్రమల స్థాపనతో ఇక్కడి యువతకు ఉద్యోగ, ఉపాథి అవకాశాలు అందించాలని భావిస్తున్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా విధానాన్ని మన రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు సిద్ధంగా ఉన్నామని, అధికమొత్తంలో ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన చేపట్టే రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వనుందని, మన రాష్ట్రం ఆ అర్హత పొందేవిధంగా పరిశ్రమల స్థాపనను వేగవంతం చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

థామ్సన్ వంటి సుప్రసిద్ధ విదేశీ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న రెజల్యూట్ సంస్థ ద్వారా రూ. 300 కోట్లతో ఎల్ఈడీ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ వినియోగ వస్తువుల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. త్వరలో నెలకొల్పబోయే ఈ పరిశ్రమ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో 300 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో రెండు సెల్ ఫోన్ తయారీ పరిశ్రమలు ప్రారంభం కానున్నాయని, రూ. 350 కోట్లతో సెల్ ఫోన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రోమాక్స్ సంస్థ పూజాకార్యక్రమాలు కూడా నిర్వహించిందని గుర్తుచేశారు.

గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు వాటి కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసుకుంటున్నాయని, ఐటీ రంగంలో దేశవ్యాప్తంగా 13% వృద్ధి కనపరుస్తుండగా, తెలంగాణలో 16% పురోగతి ఉందని కేటీఆర్ అన్నారు. కొత్తగా ఏర్పాటుచేసే భారీ పరిశ్రమలకు 30 రోజులు, చిన్న తరహా పరిశ్రమలకు అయితే 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో థామ్సన్ భారతదేశ ప్రతినిధి బిరెన్ గోష్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, రెజల్యూట్ ఎలక్ట్రానిక్స్ సంస్థ సీఈవో ఏ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *