mt_logo

హైకోర్టు విభజనపై న్యాయశాఖ సమీక్ష జరుపుతుంది- వెంకయ్యనాయుడు

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాలంటూ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు విభజనపై న్యాయశాఖ సమీక్షిస్తోందని, ఒకసారి రాష్ట్ర విభజన జరిగితే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు ఖచ్చితంగా రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ, ఏపీలకు వేర్వేరు హైకోర్టుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని వెంకయ్యనాయుడు వెల్లడించారు.

అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారని, ఉమ్మడి హైకోర్టును విభజించాల్సిందేనని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజనపై కేంద్రం కావాలనే తాత్సారం చేస్తోందని, హైకోర్టును విభజించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఎంపీ పేర్కొన్నారు. జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్ గడ్ లు ఏర్పడినప్పుడు వారంలోపే హైకోర్టులు ఏర్పాటు చేశారని, తెలంగాణ విషయంలోనే ఎందుకు జాప్యం జరుగుతుందని జితేందర్ రెడ్డి ప్రశ్నించారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ హైకోర్టు విభజన చేయడం చిన్నపని అని, సీఎం కేసీఆర్ హైకోర్టు కోసం భవనం కూడా కేటాయిస్తామని చెప్పారని గుర్తుచేశారు. హైకోర్టు విభజన విషయంలో కేంద్రం జాప్యం చేస్తోందని, విభజన జరిగేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఎంపీ వినోద్ తేల్చిచెప్పారు.

ఇదిలాఉండగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ హౌస్ లో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని కలిసి హైకోర్టును విభజించాలంటూ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో భూముల్ని ఆక్రమించిన కొంతమంది ఆ భూముల్ని కాపాడుకునేందుకు హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారని అరుణ్ జైట్లీకి వివరించారు. సెక్షన్-31 ప్రకారం కేబినెట్ తీర్మానం చేసి రాష్ట్రప్రతి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే హైకోర్టు విభజన జరుగుతుందని ఎంపీలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *