mt_logo

తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న దిగ్గజ ఫ్రెంచ్ కంపెనీలు

కొత్త రాష్ట్రమైనా పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ మొదటి వరుసలో ఉంటోంది. నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరం పెట్టుబడిదారులను ఆకర్షించడంలో యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. తాజాగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాలని ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ పెట్టుబడులకు అవకాశాలను పరిశీలించేందుకు ఫ్రాన్స్‌కి చెందిన వంద మందికి పైగా వ్యాపారవేత్తలు, రాయబారులు, కంపెనీల ప్రతినిధులు అక్టోబరు 8న తెలంగాణలోల పర్యటించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను ఇండో ఫ్రెంచ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఐఎఫ్‌సీసీఐ) చేసింది. ఫ్రాన్స్‌ నుంచి రానున్న పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న పారిశ్రామిక విధానం, ఇక్కడి వనరులు తదితర అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా వివరించనున్నారు. ​ముఖ్యంగా ఎయిరో స్పేస్‌, అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలియజేయనున్నారు.

రానున్న దిగ్గజ కంపెనీలు ఇవే :

ఫ్రెంచ్‌ నుంచి వస్తున్న కంపెనీల్లో ఎయిరో స్పేస్‌ రంగంలో ప్రముఖ కంపెనీలైన సఫ్రాన్‌, ఫ్రాగ్రాన్సెస్‌ జెయింట్‌ మనే వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎయిరోస్పేస్‌ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో తుది చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఫ్రెంచ్‌ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ఐఎఫ్‌సీసీఐ డైరెక్టర్‌ పాయల్‌ ఏ కన్వర్‌ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు సంతృప్తికరంగా ఉన్నారని, అందువల్లే మరిన్ని కంపెనీలు తెలంగాణ వచ్చేందుకు రెడీగా ఉన్నట్టు వివరించారు.

వేలాదిగా ఉపాధి అవకాశాలు :

విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫ్రెంచ్‌ 9వ స్థానంలో ఉంది. దేశంలో ఉన్న ఫ్రెంచ్‌ కంపెనీల్లో 3.50 లక్షల మంది భారతీయులకు ఉపాధి లభిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, అందులో అధిగ భాగం తెలంగాణకే దక్కే అవకాశం ఉందని ఐఎఫ్‌సీసీఐ అభిప్రాయపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *