mt_logo

అన్ని రంగాల్లో మనమే ముందున్నాం : శాసనసభలో సీఎం కేసీఆర్

“సమైక్య పాలనలో సర్వశక్తులూ ఉడిగిపోయి సతమతమైన పల్లెలు, పట్నాలు, ఇప్పుడు ఎలా కళకళలాడుతున్నాయో, కాసులతో గలగలలాడుతున్నాయో.. గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సోదాహరణంగా వివరించారు. “చేసే వాళ్లనే జనం అడుగుతారు. అందుకే మమ్మల్ని మరింత పని చేయాలని అడుగుతున్నారు. చేస్తాం. గతం కంటే పల్లెలు బాగు పడ్డాయో లేదో ప్రతిపక్షాలు గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించాలె. గ్రామాలు మంచి రూపం తీసుకుంటున్నాయి. సర్పంచులకు నేను చేతులెత్తి మొక్కుతున్న. సర్పంచులు, అధికారుల కృషితోనే పల్లెల్లో ప్రగతి సాధ్యమవుతున్నది. పాజిటివ్‌ డైరెక్షన్‌లో మంచి పని జరుగుతున్నది. గిరిజన బిడ్డలు ఉన్నంతలో మంచిగా పనిచేసుకుంటున్నరు. ఆదిలాబాద్‌లో అంటురోగాలు, విషరోగాలు పోయినయి. భగీరథ వల్ల కమ్యూనికబుల్‌ డిసీజెస్‌ తగ్గినయి. ఒక మంచిని మంచి అంటే చేసేవాళ్లకు ఉత్సాహం వస్తది. ఇంకా మంచి జరుగుతది. ఎక్కడన్నా పని జరుగకపోతే మా దృష్టికి తీసుకొని రండి. సత్వరమే పరిష్కరిస్తాం” అని అన్నారు.

దేశంలో అన్నిరంగాల్లో మనం ఫస్ట్‌:

“ఉద్యోగుల, అనుబంధ ఉద్యోగుల వేతనాల్లో, గ్రామ కార్యదర్శుల నియామకంలో, ఫ్లోరైడ్‌ లేని స్వచ్ఛమైన మంచినీళ్లిచ్చే రాష్ట్రంగా, లోకల్‌ బాడీస్‌ కలెక్టర్ల వ్యవస్థ ఏర్పాటులో, పంచాయతీలకు క్రమం తప్పని నిధుల విడుదలలో, ఉపాధి హామీ నిధుల వినియోగంలో.. ఇలా ప్రతీ రంగంలో మనమే ముందున్నాం” అని తెలిపారు.

విపక్షాలు కండ్లు తెరిచి చూడాలి :

“గ్రామీణాభివృద్ధి కోసం పదేండ్లలో కాంగ్రెస్‌ 12,173 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, ఏడేండ్లలో టీఆర్‌ఎస్‌ సర్కారు 58,303 కోట్లు వెచ్చించింది. నగరాలు నవచైతన్యంతో నగారాలు మోగిస్తున్నాయి. రాజకీయ రంగుటద్దాల్లోంచి వేరుచేసి చూడకుండా అన్ని ప్రాంతాల్లో సమతుల అభివృద్ధిని సజావుగా సాగిస్తున్నాం. నడిబొడ్డు, మారుమూల అనే తేడాలు చెరిపేస్తున్నాం. సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ చిరునామాగా మారుతున్నది. చెత్తసమస్యను చిత్తశుద్ధితో పరిష్కరిస్తున్నాం. నిన్నటి డొక్కుబండ్లు పోయి బెంజి ట్రక్కులు వచ్చాయి. కాదేదీ అనర్హం అన్నట్టు వ్యర్థాల నుంచి సంపద సృష్టి జరుగుతున్నది. అంతిమసంస్కారాలు సంస్కారవంతంగా జరగాలని వైకుంఠధామాలు నెలకొల్పుతున్నాం. తోటలు కోల్పోయి బోసిగా మారిన భాగ్యనగరాన్ని ట్రీసిటీగా నిలబెట్టాం. పచ్చదనం పరుచుకుంటుంటే సంక్షేమానికి బాటలు వేస్తున్నాం. అర్బన్‌ మిషన్‌ భగీరథతో మంచినీటి సరఫరా మెరుగుపడింది. మార్కెట్లు, పార్కులు, రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌ పాసులు అంతటా కొత్తదనం కనిపిస్తున్నది. ఎంతో చేశాం.. చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నదని వినమ్రంగా మనవి చేస్తున్నాం. విపక్షాల కంటికి ఈ అభివృద్ధి కనిపించడం లేదు. కారణం.. వాళ్లు దీన్ని చూడాలనుకోవడం లేదు. వాళ్లు కండ్లు తెరిచి చూడాలి. ఈ అభివృద్ధి అంతా విపక్షాల కండ్లకు స్పష్టంగా కనబడాలనే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల పైచిలుకు ఎల్‌ఈడీ బల్బులు పెట్టించినం. వారి కంటిచూపు బాగుపడాలని, వారు ప్రగతిని చూడాలని కోరుకుంటున్నాం” అని సీఎం కేసీఆర్ ఉద్విగ్నంగా మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *