కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకనుండి వీరికి ఉచిత డయాలసిస్ సేవలు అందించబోతున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. బుధవారం ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసి.. ఈ కేంద్రాల్లో ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి డయాలసిస్ సేవలను అందించాలని అధికారులకు సూచించామన్నారు. డయాలసిస్ చేయించుకోవడం కిడ్నీ రోగులకు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో వారికోసం ఈ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో 43 డయాలసిస్ కేంద్రాలు నడుస్తున్నాయని, వీటి ద్వారా 10 వేల మంది రోగులకు సేవలు అందుతున్నాయన్నారు. డయాలసిస్ సెంటర్ల నిర్వహణకు ప్రతి ఏడాది ప్రభుత్వం 100 కోట్లు ఖర్చు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రోగుల సంఖ్యకు తగినట్టుగా డయాలసిస్ మెషీన్లను ఏర్పాటు చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశించామని.. ఇకనుండి ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు సేవలందించేందుకు డయాలసిస్ కేంద్రాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. వీరితోపాటు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈహెచ్ఎస్ కింద ఉచిత డయాలసిస్ సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. రోగుల సంఖ్య ఆధారంగా కొత్త డయాలసిస్ కేంద్రాల అవసరం ఉన్న ప్రాంతాల జాబితా తయారు చేయాలని ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యద రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతీ మీనా తదితరులు పాల్గొన్నారు.