నకిలీ డాక్యుమెంట్లతో పాస్ పోర్ట్ , మనుషుల అక్రమ రవాణా కేసులో మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2004 లో ఎమ్మెల్యేగా పని చేసిన తరుణంలో భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కొడుకు భరత్ సాయి రెడ్డి పేర్లతో గుజరాత్ కు చెందిన ఒక కుటుంబానికి నకిలీ పాస్ పోర్టులు తయారుచేసి ఇచ్చారు. వాటి ఆధారంగా నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, వీసాలు సంపాదించి, ముగ్గురినీ తనతో అమెరికా తీసుకువెళ్ళారు.
ఆ ముగ్గురూ అమెరికాకు వెళ్లి 14 ఏళ్ళు అయినా ఇండియా కి తిరిగి రాలేదు. దీనిపై అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. పేర్లు కుటుంబ సభ్యులవి ఉన్నప్పటికీ, ఫోటోలు మాత్రం వేరేవి వున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసేసరికి అది గుజరాత్ కు చెందిన కుటుంబంగా వెల్లడయింది. దీంతో సోమవారం రాత్రి నార్త్ జోన్ పోలీసులు జగ్గారెడ్డి ని అరెస్టు చేసారు.