– పర్యావరణానికి నష్టం చేసి, బాగు కోసం ఆలోచించటం కాదు, ఉన్నది ఉన్నట్లు రక్షించుకుందాం
– ప్రకృతి, అడవులు, జీవావరణ వ్యవస్థను కాపాడుకుంటేనే మానవులకు మనుగడ
– కేంద్ర అటవీ శాఖ, అమెరికా అంతర్జాతీయ అభివృద్ది సంస్థ నేతృత్వంలో ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమం
– తెలంగాణలో మెదక్ అటవీ ప్రాంతం ఎంపిక
– ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ప్రకృతి, పర్యావరణాన్ని కలుషితం చేసి, రక్షిత చర్యలు చేపట్టడంకంటే, ఉన్న అడవులు, నీటి వనరులను యధాతథంగా కాపాడుకోవటమే మంచిదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో జరిగిన సదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, యూఎస్ ఎయిడ్, కేంద్ర, రాష్ట్ర అటవీ అధికారులతో కలిసి తెలంగాణలో ఫారెస్ట్ ప్లస్ 2.0ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అటవీ అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన చర్యలకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. క్షీణించిన అడవుల పునరుద్ధరణ, తెలంగాణ అంతటా పచ్చదనం పెంపొందించాలనే లక్ష్యంతో తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రజలకు స్వచ్చమైన గాలి, నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రకృతి, అడవులు, జీవావరణ వ్యవస్థను కాపాడుకుంటేనే మానవులకు మనుగడ ఉంటుందని, ఆదిశగా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
యూఎస్ ఎయిడ్ డిప్యూటీ మిషన్ డైరెక్టర్ రమనో ఎల్ హమ్జావి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెద్దఎత్తున అమలుచేస్తున్న అడవుల పునరుజ్జీవనం, వన్యప్రాణుల రక్షణ చర్యలు బాగున్నాయన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడి, ప్రకృతి సంపదను పెంపొందించడానికి చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం బాగుందని ఆమె ప్రశంసించారు.
పర్యావరణ రక్షిత చర్యలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలకు అనుగుణంగా అటవీ శాఖ పనిచేస్తోందని, ఫారెస్ట్ ప్లస్ 2.0 విజయవంతానికి శాఖ అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తామని పీసీసీఎఫ్ ఆర్. శోభ వెల్లడించారు.
అడవుల సమగ్ర అభివృద్ధి, నీటి వనరుల సంరక్షణకు తోడు, అడవులపై ఆధారపడి జీవించేవారి ఆర్థిక ప్రమాణాలు పెంచటమే లక్ష్యంగా యూఎస్ ఎయిడ్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఫారెస్ట్ ప్లస్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఐక్యరాజ్య సమతి 2021 నుంచి 2030 సంవత్సరాలను అంతర్జాతీయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థల పునరుద్ధరణ దశాబ్ధంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ సహకారంతో మూడు రాష్ట్రాల్లోని మూడు అటవీ సర్కిళ్లలో ఈ కార్యక్రమాన్ని కేంద్ర అటవీ శాఖ అమలు చేస్తోంది. బీహార్, కేరళకు తోడు తెలంగాణలో మెదక్ అటవీ డివిజన్ ను ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు. ఉమ్మడి కార్యక్రమం కింద మెదక్ ఫారెస్ట్ డివిజన్ నిర్వహణను మెరుగుపరచడానికి యుఎస్ ఎయిడ్, తెలంగాణ అటవీ శాఖకు సాంకేతిక సహాయం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో యూఎస్ ఎయిడ్-ఇండియా ప్రతినిధి వర్గీస్ పాల్, కేంద్ర అటవీ శాఖ ఐజి నోయల్ థామస్, మెదక్ జిల్లా కలెక్టర్ కె. ధర్మారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ ఎండీ రఘువీర్, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ కన్వర్జీత్ సింగ్, ఫారెస్ట్ ప్లస్ 2.0 తెలంగాణ నోడల్ అధికారి లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్(అడ్మిన్) మునీంద్ర, అదనపు పీసీసీఎఫ్ లు ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి. పర్గెయిన్, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.