mt_logo

అడవుల రక్షణ, పచ్చదనం పెంపుపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం

– పర్యావరణ పరంగా మన అప్రమత్తతే భవిష్యత్ తరాలకు శ్రీ రామరక్ష
– ఉన్న అడవిని స్థిరీకరించుకుందాం, కొత్తగా పచ్చదనం మరింత పెంచుకుందాం
– అడవుల పునరుజ్జీవనం, హరిత తెలంగాణ‌ లక్ష్యంగా పనిచేద్దాం
– ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం, అధికారులు, సిబ్బంది నిబద్ధతతో లక్ష్య సాధన
– అడవుల రక్షణ, పచ్చదనం పెంపుపై సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం

తెలంగాణ రాష్ట్రాన్ని పర్యావరణ హితంగా, పచ్చదనం పరంగా అవసరమైన జాతీయ సగటు 33 శాతానికి చేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని మంత్రుల కమిటీ వెల్లడించింది. అడవుల రక్షణ, పచ్చదనం పెంపుపై అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసారి సచివాలయంలో సమావేశమైంది. ఈ స‌మావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

కమిటీ కన్వీనర్ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి గత ఐదేళ్లుగా అటవీ శాఖ పనితీరు, చేపట్టిన కార్యక్రమాలపై మంత్రుల కమిటీకి వివరించారు. తెలంగాణకు హరితహారం ద్వారా అడవుల లోపల, బయట కలిపి ఐదు విడతల్లో 177 కోట్ల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు అటవీ పునరుజ్జీవన చర్యలను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని, అటవీ ప్రాంతాల రక్షణకు కందకాలు తవ్వటం, వాటి కట్టలపై గచ్చకాయ చెట్లు నాటుతున్నామన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో బతుకుతున్న శాతంపై మంత్రులు ఆరా తీశారు. నిరంతర సంరక్షణ చర్యలు, పర్యవేక్షణతోనే బతికిన శాతం పెరుగుతుందని, కొత్త పంచాయితీ రాజ్ చట్టంలో వివిధ స్థాయిల్లో జవాబుదారీతనం కూడా స్పష్టమైందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్క‌ల్లో ఎన్ని మొక్క‌లు బ‌తికి ఉన్నాయనే దానిపై స‌మ‌గ్ర‌ గ‌ణాంకాల‌ను న‌మోదు చేయాలి, నాటిని మొక్క‌ల్లో 85% వాటిని కాపాడుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత హారం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, 30 రోజుల గ్రామ ప్ర‌ణాళిక‌లో అట‌వీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున నాటిన మొక్కలను పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలని మంత్రులు తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుందని మంత్రులు మెచ్చుకున్నారు. దీనిని మరింత విసృతం చేయాలని సూచించారు. అలాగే కంపా నిధుల వినియోగంలో వచ్చిన వెసులుబాటును పూర్తిగా సద్వినియోగం చేసుకుని అటవీ పునరుజ్జీవన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అటవీ భూముల వివాదాలను ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి వ‌ర్గ ఉప సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని పర్యావరణ రక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవటం, ఉన్న అడవిని స్థీరీకరించుకునేలా రక్షణ, పునరుజ్జీవన చర్యలు, పండ్ల చెట్ల పెంపకంపై అటవీ శాఖ దృష్టి పెట్టాలని మంత్రులు సూచించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన జంగల్ బచావో, జంగల్ బడావో నినాద స్ఫూర్తిని కొనసాగిస్తూ పోలీసు, రెవెన్యూ శాఖల సమన్యయంతో అట‌వీ భుముల్లో చొర‌బాటుదారులు రాకుండా నిరోధించడం, ఆక్ర‌మ‌ణ‌లు కాకుండా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవడంతో పాటు, అటవీ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, క‌ల‌ప అక్ర‌మ రవాణాపై నిరంతర నిఘా పెట్టాలన్నారు. అట‌వీ మార్గాల్లో సీసీ కెమ‌రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అటవీ శాతం అతి తక్కువ ఉన్న జిల్లాలపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగింది. కరీంనగర్, గద్వాల, హైదరాబాద్, జనగామ, వరంగల్ అర్బన్, నారాయణ పేట, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో అతి తక్కువ పచ్చదనం ఉందని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పచ్చదనం పెంచాలని నిర్ణయించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, మిగతా పార్కులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రులు సూచించారు. అటవీ పునరుజ్జీవన చర్యలు, అడవుల్లో నీటి వసతుల కల్పన చర్యల వల్ల అటవీ ప్రాంతాల్లో మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ చాలా వరకు తగ్గిందని, వన్యప్రాణులు సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని అధికారులు వెల్లడించారు.

సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ ఆర్. శోభ, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ మునీంద్ర, అదనపు అటవీ సంరక్షణ అధికారులు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం. డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి పర్గెయిన్, సింగరేణి అధికారులు సురేంద్ర పాండే, బి.మహేష్, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *