దేశంలో ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పచ్చదనం రికార్డుస్థాయికి పెరిగింది. 2019 నుంచి 2021 వరకు రెండేండ్లలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఏకంగా 632 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈనెల 19న విడుదల చేసిన హ్యాండ్ బుక్ 2021-22లో పచ్చదనం, అటవీ విస్తీర్ణంలో తెలంగాణ సాధించిన విజయాలను వెల్లడించింది. కాగా రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం ద్వారా మొక్కలు నాటడంపై, వాటి మనుగడపై ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధ ఫలితంగా… రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగి, పచ్చదనం గణనీయంగా పెరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్, అటవీ పునరుద్ధరణ వంటి కార్యక్రమాలతో రెండేండ్లలో 334 చదరపు కిలోమీటర్ల మేర చెట్ల విస్తీర్ణం పెరిగింది. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్‌లో 1,423 చదరపు కిలోమీటర్లు, మధ్యప్రదేశ్‌లో 285 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. తెలంగాణలో మాత్రం అటవీ విస్తీర్ణం 2015లో 19,854 చదరపు కిలోమీటర్ల నుంచి 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హరితహారం ద్వారా 2022 జనవరి వరకు 230 కోట్ల మొకలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 235.59 (102.6 శాతం) కోట్ల మొకలు నాటారు. చెట్ల విస్తీర్ణం 2015లో 2,549 చదరపు కిలోమీటర్ల నుంచి 2021 నాటికి 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
అడవులు,చెట్ల విస్తీర్ణాన్ని పెంచడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రోల్ మాడల్‌గా నిలిచింది.తెలంగాణ ప్రభుత్వం 2015-16లో హరితహారం ప్రారంభించే నాటికి 19,854 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉన్నది. అప్పటినుంచి హరితహారాన్ని సమర్థవంతంగా అమలు చేయ డం, నాటిన మొకలకు నీరుపోయడం, నిర్వహించడం వంటి కార్యక్రమాలతో అటవీ విస్తీర్ణం లో స్థిరమైన పెరుగుదల సాధ్యమైంది. 2017లో 20,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అటవీ విస్తీర్ణం 2019 నాటికి 20,582 చదరపు కిలోమీటర్లకు పెరిగి, 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు చేరుకొన్నది. 2015లో 2,549 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న చెట్ల సాంద్రత 2017లో 2,669 చదరపు కిలోమీటర్లకు, 2019లో 2,514 చదరపు కిలోమీటర్లకు, 2021లో 2,848 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.