వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో బైబై మోదీ అంటూ భారీగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. బైబై మోదీ అనే హాష్ ట్యాగ్‌తో టివోలీ థియేటర్ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్, హఠాత్తుగా లాక్‌డౌన్ అని గరీబోల్లను చంపినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్ అని, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నిస్తూ స్లోగన్స్ ఉన్నాయి. అయితే ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను ఎవరు ఏర్పాటుచేశారనే విషయం తెలియాల్సి ఉన్నది.

