పేద ప్రజలకు అత్యంత ఖర్చుతో కూడిన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విభాగాన్ని ప్రవేశపెట్టగా.. సోమవారం నిర్వహించిన తొలి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ విజయవంతమైంది. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ మూడేండ్ల చిన్నారికి గాంధీ వైద్యులు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ వైద్య బృందానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రిలో దాదాపు రూ. 15 లక్షల దాకా ఖర్చయ్యే ఈ చికిత్స సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులోకి వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు.