mt_logo

ఆర్‌అండ్‌బీలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతులు

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఆర్‌అండ్‌బీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులకు గత డిసెంబర్‌ 10న క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన తర్వాత ఆర్‌అండ్‌బీ శాఖ ఆయా జిల్లాల్లో ఖాళీలు తదితర సమగ్ర సమాచారం సేకరించింది. దీని అనుగుణంగా గురువారం కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో అత్యధికంగా 132 సివిల్‌లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత సివిల్‌లోనే 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

కాగా ఆర్‌అండ్‌బీలో గతంలో మంజూరు చేసిన 62 ఉద్యోగాలను రద్దు చేశారు. సీనియర్‌ స్టెనో (లోకల్‌ క్యాడర్‌), టైపిస్ట్‌ (హెచ్‌వో), టైపిస్ట్‌ (లోకల్‌ క్యాడర్‌), టెక్నీషియన్‌ (హెచ్‌వో), ప్రింటింగ్‌ టెక్నీషియన్‌ (లోకల్‌ క్యాడర్‌), వాచ్‌మన్‌(లోకల్‌ క్యాడర్‌), స్వీపర్‌ (లోకల్‌ క్యాడర్‌) పోస్టులను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కొత్తగా అనుమతి ఇచ్చిన 472 పోస్టులతో కలిపితే.. ఇప్పటివరకు ఆర్థిక శాఖ 61,401 ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే 43,099 పోస్టులకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీచేశాయి.

రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత.. కొత్తగా మరో 7,029 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. అంటే 2022లో మొత్తం 98,171 కొలువులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 60,929 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గతంలోనే అనుమతి ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *