హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటు చేయడం సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కున్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన ఐఏఎంసీ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, పలువురు న్యాయమూర్తులు, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్నివిధాలా అనువైన ప్రాంతమని, నగరంలో ఐఏఎంసీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు, తెలంగాణ ప్రజల తరఫున, తన తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అతితక్కువ కాలంలోనే హైదరాబాద్ నగరంలో ఎమర్జింగ్ సిటీగా ఎదిగిందని అన్నారు. ఇక్కడ అన్ని రకాల సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందన్నారు.
న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వం అనేది దేశంలో రచ్చబండ లాంటి వేదికల రూపాల్లో ఎప్పటి నుంచో ఉన్నదని చెప్పారు. గ్రామాల్లో పెద్దలు పంచాయతీలు ఏర్పాటు చేసి వివాదాలు పరిష్కరించేవారని గుర్తు చేశారు. అయితే ఇపుడు దేశంలో కోర్టులు, సిబ్బంది కొరత కారణంగా పరిశ్రమలకు సంభందించిన చాలా కేసులు ఏండ్ల కొద్ది పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు సంబంధించిన వివాదాలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బేట్రేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే 25 వేల చదరపు అడుగుల స్థలం కేటాయిస్తున్నామని, శాశ్వత భవనం కోసం త్వరలో పుప్పాలగూడలో భూమి కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.