ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా రోశయ్య అంత్యక్రియలును ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని, మూడు రోజులు సంతాప దినాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.