mt_logo

1758 ఆశ్రమ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధనకు సర్వం సిద్ధం

రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 1,758 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందులో గిరిజన ఆశ్రమ పాఠశాలలు 326, ప్రభుత్వ పాఠశాలలు 1,432 ఉన్నాయి. వీటిలో 1.5 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు అజీంప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశారు. తొలుత ఉట్నూరు, భద్రాచలం, ఏటూరునాగారం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని 57 మంది ఉపాధ్యాయులను కీ-రిసోర్స్‌ పర్సన్‌గా ఎంపిక చేసి, వారికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. కీ-రిసోర్స్‌ పర్సన్స్‌ ఒక్కొక్కరు 15 మందికి చొప్పున దశలవారీగా 5,200 మంది ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌ మీడియం బోధనా పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగు మీడియంలో నడుస్తున్న ఈ పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చేందుకు అవసరమైన సదుపాయాలు, శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమశాఖ రూ.30.75 కోట్లు వెచ్చిస్తున్నది. ఇందులో రూ. 25.76 కోట్లను పాఠశాలల్లో గ్రంథాలయాలు, ల్యాబొరేటరీలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించనున్నారు. ఉపాధ్యాయుల శిక్షణ కోసం రూ.5.08 కోట్లు కేటాయించారు. ఆయా పాఠశాలల్లోని 1-8 తరగతులకు పాఠశాలలు పునఃప్రారంభం కాగానే ఇంగ్లిష్‌ మీడియంలో బోధించనున్నారు. 1 నుంచి 5వ తరగతి గిరిజన విద్యార్థులకు ప్రస్తుతం అమలుచేస్తున్న వారి మాతృభాష (కోయ, గోండు, కొలామీ, బంజారా) సబ్జెక్ట్‌ కూడా కొనసాగుతుందని గిరిజన సంక్షేమశాఖ పేర్కొన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *