సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్ అరోరా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆదాయపు పన్నుశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్కే జోషి మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేసి ఎన్నికలు సజావుగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పోలింగ్ స్టేషన్లలో వసతుల కల్పనలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచి అవార్డు గెలుచుకున్నదని, ఫిబ్రవరి 22న ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని ఎస్కే జోషి చెప్పారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటరు నమోదుకు వచ్చే నెల 4వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు, ఓటర్ల ముసాయిదా సవరణలో ఇప్పటివరకు 16 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు డీఈవోలు, ఆర్వోలు, ఎఆర్వోలు సిద్ధంగా ఉండాలని, దివ్యాంగుల ఓటింగ్ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ సేవలకు జాతీయ అవార్డు కూడా వచ్చిందని రజత్ కుమార్ గుర్తుచేశారు.రాష్ట్రంలో 2.5 లక్షల మంది ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని, ప్రధానంగా 1950 టోల్ ఫ్రీ నం. మరింత పటిష్ఠం చేసి అన్ని రకాల ఫిర్యాదులు పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు.