Mission Telangana

హైదరాబాద్ ఐఎస్‌బీ గ్రేట్!!

ఫైనాన్షియల్ టైమ్స్(లండన్) గ్లోబల్ ఎంబీయే ర్యాంకింగ్-2019లో హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) 24వ ర్యాంకు దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ ర్యాంకింగ్స్ లో భారత్ నుండి టాప్ 25లో ఉన్నది ఒక్క ఐఎస్‌బీనే కావడం గమనార్హం.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 4 స్థానాలు మెరుగుపడింది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్(PGP)ను ప్రధానంగా అందజేస్తున్నారు. ఈ స్కూల్ లో మొత్తం 900 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా, అందులో 34 శాతం మహిళా విద్యార్ధినులు ఉన్నారు. ప్రపంచంలోని ఏ బిజినెస్ స్కూల్ లో కూడా ఇంతమంది మహిళా విద్యార్ధినులు లేరు.

ఐఎస్‌బీకి దేశంలో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ అయితే రెండోది పంజాబ్ లోని మొహాలీలో ఉంది. 2001లో ప్రారంభమైన హైదరాబాద్ ఐఎస్‌బీ గడిచిన 12 ఏళ్లలో అత్యంత వేగంగా అభివృద్ధి సాధించింది. 2015 సం.లో 33వ స్థానంలో నిలిచిన ఐఎస్‌బీ గత ఏడాది 28వ స్థానం, ఈ ఏడాది 24వ స్థానాన్ని పొందడం చెప్పుకోదగ్గ పరిణామం. ఐఎస్‌బీ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మూడేళ్ళ అనంతరం పూర్వ విద్యార్ధుల వేతనాలు 2015లో 131 శాతం పెరగగా, 2019 సం. లో 187 శాతానికి పెరిగాయి. ఈ సందర్భంగా ఐఎస్‌బీ డీన్ రాజేంద్ర శ్రీవాత్సవ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు, పరిశోధనల కొనసాగింపు, మెరుగైన నిర్వహణ వంటి లక్ష్యాలతో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను ఏర్పాటు చేశామన్నారు. సంస్థను ప్రారంభించి 18 ఏళ్ళు గడుస్తుందని, గత 12 ఏళ్లుగా ఐఎస్‌బీ ఉత్తమ ప్రదర్శనను కనబరుస్తుందని, తాజాగా దేశం గర్వించేలా ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ లో అత్యున్నత ర్యాంకు సాధించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *