mt_logo

రేవంత్ కు మరింత బిగుస్తున్న ఉచ్చు!

ఓటుకు నోటు కేసులో ఈసీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ డైరీ, రేవంత్, స్టీఫెన్ సన్ వాంగ్మూలం రికార్డు సర్టిఫైడ్ కాపీలను కోర్టు ద్వారా ఎలెక్షన్ కమిషన్ పొందినట్లు తెలిసింది. కోర్టు నుండి లిఖిత పూర్వక నివేదికలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘానికి పూర్తిస్థాయి నివేదికను పంపేందుకు ఈసీ సిద్ధమైందని సమాచారం. ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన రేవంత్ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఈసీకి ఈ నివేదిక కీలకం కానుంది.

నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ రెడ్ హాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డి వ్యవహారంపై ఎప్పటికప్పుడు ఏసీబీ ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ కు సమాచారం ఇస్తున్నారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడంపై తీవ్రంగా స్పందించిన ఈసీ ఈ కేసుకు సాధ్యమైనంత త్వరగా ముగింపు ఇవ్వాలని ఏసీబీ ఉన్నతాధికారులకు లేఖ కూడా రాసింది. దీన్నిబట్టి చూస్తే ఈసీ కూడా రేవంత్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా రేవంత్ వీడియో, చంద్రబాబు ఆడియో సంభాషణలకు సంబంధించిన లిఖిత పూర్వక నివేదికలను కూడా తాము కోర్టు నుండి కోరే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎఫ్ఎస్ఎల్ తుది నివేదిక కూడా తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ వేస్తామని ఈసీ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *