తెలంగాణ ప్రభుత్వం వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు, సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డును ప్రకటించింది. ఈ నెల 25న ఢిల్లీలో నిర్వహించే ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022’లో తెలంగాణ ప్రభుత్వానికి ఈ పురసారాన్ని అందజేయనున్నది. నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతోపాటు ఇజ్రాయెల్, స్వీడన్ రాయబార కార్యాలయాలు ఈ కాంక్లేవ్‌కు సహకారాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్టు టైమ్స్ మ్యాగజైన్ వివరించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని సతరించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ‘ఎకనమిక్ టైమ్స్’ ఎడిటర్ టీ రాధాకృష్ణ తెలిపారు. కాగా ఎకనమిక్ టైమ్స్ అవార్డుపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్… ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనమిక్ టైమ్స్ అవార్డు నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉందని, తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విస్తృతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికకు ధన్యవాదాలు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

