mt_logo

డబుల్ బారెల్ జ‘గన్’!

By: పొఫెసర్ ఘంటా చక్రపాణి 

 

సిరిసిల్ల పరిణామాలు శ్రీలంకను గుర్తుకు తెచ్చాయి. అందుకు ముందుగా తెలంగాణ లిబరేషన్ టైగర్ రహీమున్నీసాకు తెలంగాణవాదులంతా కృతజ్ఞతలు చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల తెగువ కళ్ళారా చూసే అవకాశం వచ్చినందుకు వై.ఎస్. విజయమ్మకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. విజయమ్మ సిరిసిల్ల ప్రయాణమైన తీరు, ఆమెకు బాసటగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఒక జాత్యహంకార ధోరణిని గుర్తుకు తెచ్చాయి. ఆ ధోరణి తెలంగాణ ఆత్మాభిమానాన్ని మరోసారి తట్టిలేపింది. కచ్చితంగా రహీమున్నీసా సీమాంధ్ర వితండవాదులకు వెన్నులో చలి పుట్టించింది. ఇప్పుడు తెలంగాణ ప్రపంచమంతా రహీమున్నీసా త్వరగా కోలుకోవాలని కోరుకుంటోంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఆమె యావత్ తెలంగాణ యువతకు స్ఫూర్తి ప్రదాత కావాలని ఆశిస్తోంది.

శ్రీలంకలో కూడా రహీమున్నీసా లాంటి అనేకమంది యువతీ యువకులు అక్కడి పాలకులను ఉక్కిరి బిక్కిరి చేశారు. రెండు దశాబ్దాలు వెనక్కి సరిగ్గా విజయమ్మ ఉత్తర తెలంగాణకు వెళ్ళినట్టే శ్రీలంక ఉత్తర-తూర్పు భూభాగంలో ఉన్న తమిళ ప్రాంతాలకు శ్రీలంక ప్రభుత్వం వెళ్ళాలంటే ముందు సైన్యం, ఆ వెనక భారీ కాన్వాయి బయలుదేరేది. దారిపొడుగునా సాయుధ వైమానిక దళాలు, హెలీక్యాప్టర్లు పహారా కాసేవి. అప్పుడు శ్రీలంకలోని తమిళ ప్రాంతాలు విముక్త ప్రాంతాలుగా ఉండేవి. అంటే శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళులు ఎల్‌టీటీఈ ఆధ్వర్యంలో తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకుని స్వయం పరిపాలన సాగించేవారు. తమిళ ప్రాంతీయ ఉద్యమం కూడా సరిగ్గా మన తెలంగాణ తొలి ఉద్యమ కాలంలోనే మొదలయ్యింది. అచ్చం 1969లో మన యువకులు విద్యార్థుల్లాగే అక్కడి కాలేజీల్లో, విశ్వవిద్యాలయాల్లో సీట్లురాని యువకులు, నిరుద్యోగులు తమకు న్యాయం కావాలని ఆందోళనకు దిగారు. తమిళులకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తితో కూడిన ‘ఈలం’ అంటే ప్రాంతం కావాలని ఉద్యమించారు. అనేక దఫాలుగా పోరాడి అన్ని ప్రజాస్వామిక మార్గాలు మూసుకుపోయిన తరువాత విసిగి వేసారి అక్కడి తమిళులు తమకు తాము స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. అదే తమిళ ఈలం. దీనికి సొంతగా త్రివిధ దళాలతోపాటు అన్ని రకాల మంత్రిత్వ శాఖలు, విద్య, వైద్యం, నీటి వసతి, ప్రజా పంపిణీ మొదలు అన్ని పౌర సేవా విభాగాలు ఉండేవి. అంటే సింహాళ జాత్యహంకార జాతీయ ప్రభుత్వానికి పోటీగా తమిళులు తమ స్వతంత్ర ప్రభుత్వాన్ని, స్వయం పరిపాలనను నడిపించేవారు. తమిళ ప్రాంతీయ ఆకాంక్షను ఓడించాలనుకున్నప్పుడల్లా ప్రభుత్వాలు ఆ ప్రాంతానికి సాయుధ బలగాలతో ప్రయాణమై ప్రాణాల మీదికి తెచ్చుకుంటూ ఉండేవి. సరిగ్గా విజయమ్మ కూడా తెలంగాణ నడిబజారులో అలాగే పరువుతీసుకుని బతుకు జీవుడా అని ప్రాణాలతో బయటపడింది.

రహీమున్నీసా వరంగల్ నుంచి సిరిసిల్ల దాకా ప్రయాణించి వచ్చింది. సాయుధ బలగాల చక్రబంధం, కిరాయి కార్యకర్తల కోలాహలం దాటుకుని రహీమున్నీసా నేరుగా విజయమ్మ ముందు పోలీసు జీపు మీదికి ఎక్కి చెప్పు చేతిలోకి తీసుకుంది. అంతే! విజయమ్మకు కచ్చితంగా చాకలి ఐలమ్మ కనిపించి ఉంటుంది. విజయమ్మ సిరిసిల్లలో ప్రసంగిస్తున్నప్పటి దృశ్యం మీకు గుర్తుందా! టీవీలో ఆమె ప్రసంగాన్ని చూస్తున్నప్పుడు నాకైతే ఆమె పులిబోనులో చిక్కిన తుంటరి నక్కలా కనిపించింది. ముఖం నిండా చెమటలు, వణుకుతున్న కంఠం, తడారిపోయిన గొంతులో తడబడే మాటలు, పొంతనలేని ప్రసంగం, ఆమె హావభావాలు, ముఖ కవళికలు గమనిస్తే ఈ పులుల కొనలోంచి ఎలా బయట పడగలనన్నట్టుగా కనిపించాయి. ఎప్పుడూ నిండుగా నవ్వుతూ కనిపించే ఆమె ముఖం గతంలో ఎప్పుడూలేని ఆందోళన! అది భయం, అవమానభారం, అహం దెబ్బతిన్న అసహనం కలగలిసిన ఆందోళన. ఆ భయాందోళన వల్లనే ఆమె ఒక చేత బైబిల్‌ను బిగపట్టుకున్నారు. చేయకూడని పాపంచేసి దొరికిపోయిన పశ్చాత్తాపం ఆమెలో ఆద్యంతమూ కనిపించింది. ఆరు గంటలు ప్రయాణంచేసి, అడ్డొచ్చిన ప్రతివ్యక్తిని చితకబాదించి, తెలంగాణ ఆత్మలను అల్లకల్లోలం చేసి ఆమె ఏం సాధించారు? అవమానపడ్డారు. అభాసు పాలయ్యారు. కడప పౌరుషాన్ని కరీంనగర్ మానేరు వాగులో కలిపేసుకుని బిక్కుబిక్కుమంటూ గంటలో వెనుదిరిగి వెళ్ళిపోయా రు. సాధారణంగా రాజకీయ నాయకులు పాలకుల తప్పిదాలను ఎత్తిచూపడానికి, ప్రజల బాధలను అర్థం చేసుకోవడానికి, బాధితులకు భరోసా ఇచ్చి, వారిలో మనోధైర్యాన్ని కలిగించడానికి, ఓదార్చడానికి పర్యటలు చేస్తుంటారు. అందులో భాగంగా అధికారులతో, స్థానిక పౌర సమాజ ప్రతినిధులతో సమావేశమై కారణాలను ఆరా తీస్తారు. వాటి పరిష్కారానికి తమవైపు నుంచి సూచనలు చేస్తూ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం కోసం దీక్షలు చేస్తారు. ఆ దీక్షలతోనైనా పాపాలకు బాధ్యులైన పాలకులు కళ్ళుతెరిచి బాధితులకు న్యాయం చేస్తారని, తమ విధానాలు సవరించుకుని సన్మార్గంలో నడుస్తారని ఆశిస్తారు. కానీ సిరిసిల్ల విషయంలో ఆ అవకాశం లేదని విజయమ్మకు తెలు సు. ఎందుకంటే చనిపోయిన చేనేత కార్మికుల్లో ఎక్కువమంది స్వయంగా విజయమ్మ గారి భర్త రాజశేఖర్‌డ్డి బాధితులే. ఇప్పుడు తప్పులను తెలుసుకొని, పశ్చాత్తాపం చెందడానికి ఆయన బతికి లేరు. ఆయన బతికున్నప్పుడు సిరిసిల్లలో ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన చేనేత కార్మికులు 375మంది కాగా అందులో 215 మంది స్వయంగా ఆయన గారి ఆదర్శపాలనలోనే అసువులు బాసారు. పోనీ తన భర్త తప్పులకు ఆమె ప్రాయశ్చిత్తం చేసుకున్నారా అంటే తన ప్రసంగంలో ఒకటి రెండుసార్లు నేతన్నలు అని ప్రస్తావించడం మినహా చేనేత రంగ సమస్య గురించి గానీ, పరిష్కారం గురించిగానీ ఒక్క ముక్కయినా చెప్పలేకపోయారు. అంతదూరం వెళ్లి కనీసం ఒక్క కుటుంబాన్నయినా కలిసి వాళ్ళ సమస్యలేమిటో, చావుల కారణం ఏమిటో కనుక్కోలేకపోయారు. ఒక్క కార్మికున్నయినా ఓదార్చలేకపోయారు. సరికదా ఓదార్పుకు కూడానోచుకోలేని అవమానభారాన్ని తలకెత్తుకున్నారు.
రాజశేఖర్‌డ్డి సతీమణిగా గతంలో రాజ భోగాలు అనుభవించిన విజయమ్మ ఇన్ని అవమానాలను తలకెత్తుకోవడానికి సిద్ధపడడం వెనుక వివిధ కారణాలున్నాయి. అందులో ఒకటి జైలులో ఉన్న జగన్ బాబు. ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఆమె ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఎన్ని అవమానాలైనా భరిస్తారు. అది ఆమె బలహీనత. కొడుకు విషయంలో ఆమె బలహీనతలే అతన్ని కటకటాల పాలు చేశాయని వారి గురించి తెలిసిన వాళ్ళు చెపుతుంటారు. ఆ బలహీనతే ఆమెను ఢిల్లీ వెళ్లి ప్రధాని శరణు జొచ్చేలా చేసింది. తన కొడుకును ముఖ్య,అంత్రిగా చూసుకోవాలని ఒక తల్లిగా విజయమ్మ కలగంటున్నట్టే సోనియా కూడా తనకొడుకును ప్రధానిగా చూసుకోవాలనుకుంటుంది. అది నెరవేరాలంటే పరస్పర అవగాహన అవసరమని ఇద్దరికీ అర్థమయ్యిందని రాజకీయ పరిశీలకుల అంచనా. ఆ మేరకు ఇద్దరికీ సిగ్నల్స్ ఉన్నా యి. అప్పటిదాకా కేసీఆర్‌కూ, తెలంగాణ ఎంపీలకూ ఉన్న సిగ్నల్స్ విజయమ్మ ఢిల్లీ పర్యటనతో వీకయిపోయాయి. ఆ సిగ్నల్స్ ప్రభావం వల్లే ఆమె ఢిల్లీ నుంచి వచ్చిన మరుక్షణం నుంచి అప్పటిదాకా సాగిన సవాళ్లు, శాపనార్థాలు ఆగిపోయాయి. ప్రధానిని కలిసి సీబీఐ వేధింపులపై ఫిర్యాదు చేస్తానని చెప్పిన విజయమ్మ, ఆమె పార్టీకి ఇప్పుడు సీబీఐ తన పని తాను చేసుకునిపోతోన్న ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థగా కనిపిస్తోంది. జగన్ కేసులో రాజకీయ జోక్యం లేనేలేదని, ప్రభుత్వ ప్రమేయం అసలే లేదని ఆ పార్టీ నాయకులే ఇప్పుడు వాదిస్తున్నారు. జగన్‌ను ఆర్థిక నేరాల్లో ఇరికించే కుట్రదారులంతా వారికి స్నేహితులైపోయారు. ప్రణబ్ ముఖర్జీ అత్యంత గౌరవూపదమైన రాజకీయనేత గా మారిపోయారు. అడగకపోయినా ఆయనకు మద్దతు పలకడం, రాష్ట్రపతి గా ఆయనకు గంపగుత్తగా ఓట్లేసి గెలిపించడం ఇవన్నీ ఢిల్లీ ప్యాకేజీలో భాగంగానే జరిగాయి. ఈ ప్యాకేజీలో రెండో అంశం తెలంగాణవాదాన్ని తెరమరుగు చెయ్యడమని అంటున్నారు. అంటే ఇంతకాలం కోస్తా తీరంలో కొంగ జపం చేసిన జగన్, ఆయన వర్గం ఇప్పుడు తెలంగాణకు కూడా వస్తారు. మొదట దీక్షల పేరుతో దిగుతారు. ఆ తరువాత ఓదార్పుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. విజయమ్మ వచ్చింది కేవలం పైలట్‌గా మాత్రమే తప్ప మరోపనికి కాదు, జగన్ బాబు వెళ్ళమని అన్నాడని అందుకే తాను వచ్చానని విజయమ్మ స్వయంగా చెప్పారు. ఈలోగా జగన్‌కు బెయిల్ వస్తే ఆయన మొదట బయలుదేరేది తెలంగాణ ఓదార్పు దండయావూతకే నని ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. జగన్ కోస్తాలో తెలుగుదేశం పార్టీని, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని లేకుండాచేసి 2014లో 40 మంది ఎంపీలను ఢిల్లీ కి పంపిస్తానని అక్కడి పెద్దలకు చెప్పినట్టు వినికిడి. అందుకే కోస్తా తెలుగుదేశంలోంచి మళ్ళీ వలసలు మొదలైనాయి. ఎన్నికల దాకా కాగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బలపడి, ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో నిలబడాలన్నది జగన్ ప్లాన్ అని అంటున్నారు. ఈ సిగ్నల్ మాత్రం కేసీఆర్‌కు అందినట్టే ఉంది. గతంలోజగన్ ఆర్మూర్ పర్యటనకు అడ్డుచెప్పని టీఆర్‌ఎస్ ఇప్పుడు విజయమ్మకు అడ్డం తిరగడానికి కూడా కారణం అదే కావచ్చు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, పోలీసులు విజయమ్మకు రాజ్యాంగ అతీతంగా రాచమర్యాదలు చేస్తున్నారని అర్థమౌతోంది. మన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ముఖ్యమంత్రి మీద, డీజీపీ మీద ఫిర్యాదులు చేస్తున్నామంటూ ఢిల్లీలో కాలక్షేపం చేస్తున్నా రు. పాపం ఏం చేద్దాం వాళ్ళకూ సిగ్నల్స్ లేవు!
జగన్ చేస్తోన్న ఈ పనికి క్విడ్ ప్రో కోగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి యనకు మేలు చేసే పనిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే మంత్రులకు, కార్యదర్శులకు న్యాయసహాయం ఫైలు మీద సంతకం చేసేశారు. ఈ ఒక్క సంతకం తో ఆయన మొత్తం సీబీఐ దర్యాప్తు పరిధిని దానికున్న విశ్వసనీయతను కొట్టిపారేసి జగన్ బాబు వాదనకు జై కొట్టారు. ప్రభుత్వంలో భాగంగా ఉమ్మడి బాధ్యతతో మంత్రులు తీసుకున్న నిర్ణయాలన్నీ రాజ్యాంగ సమ్మతం, ధర్మబద్ధం అని వాదించడానికి ఆయన న్యాయవాదులకు ఫీజులు చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌కు సంబంధం ఉన్న పలు అవినీతి కేసుల్లో ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న దర్యాప్తును నీరు గార్చడానికి, వారికి వ్యతిరేకంగా వాదించడానికి ప్రభుత్వమే కొత్తగా అవినీతికేసుల్లో ఆరితేరిన న్యాయవాదులను నియమించుకునే స్వేచ్ఛను మంత్రులకు కల్పించింది. వీళ్ళు తమ వాదనలతో ప్రభుత్వ లాయర్లను ఓడిస్తారు. సీబీఐ సేకరించిన ఆధారాలన్నీ అబద్ధాలని రుజువు చేస్తారు! అంటే ప్రభుత్వమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించి కేసును కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆయన మీదున్న అవినీతి కేసులన్నీ ప్రశ్నార్థకమైపోతాయి. ఇదంతా జరిగే దాకా విజయమ్మ ప్రభుత్వం చెప్పినట్టల్లా చేస్తుంది. అన్నీ సక్రమంగా జరిగితే 2014 ఎన్నికలు వస్తాయి, ఆ లోపు జగన్‌ను ఏదో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ బయట కు తెస్తుంది. అప్పుడు అక్కడ రాహుల్ ప్రధాని కావాలన్న రాజశేఖర్ రెడ్డి కోరిక, జగన్ ముఖ్యమం త్రి కావాలన్న విజయమ్మ కల రెండూ నెరవేరుతా యి. ఇదంతా కొంచెం ఇటాలియన్ మాఫియా, కడప ఫ్యాక్షన్ కలెగలిసిన కథలా అనిపిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు! కానీ ఇది నిజమని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఈ కథ విజయమ్మ ఢిల్లీ వెళ్ళేసరికే రూపొందినట్టు అర్థమౌతోంది. ఢిల్లీ పెద్దల స్క్రిప్ట్ ప్రకారం జగన్ బయటపడాలంటే కాంగ్రెస్‌కు లోబడే తల్లీ, కొడుకూ, వారి పార్టీ నడుచుకోవాలి. తెలంగాణవాదాన్ని ఓడించాలి. ఈ షరతులతో విజయమ్మను కాంగ్రెస్ పెద్దలు అష్టదిగ్బంధం చేసినట్టు కనిపిస్తోంది. లేకపోతే మానుకోట అవమానాన్ని తన కొడుకింకా మరిచిపోకముందే ఆమె ఈ కొత్త తలనొప్పిని ఎందుకు తెచ్చిపెట్టుకుంటుంది. విజయమ్మకు ఢిల్లీ అవసరం ఎంతుందో ఢిల్లీకి కూడా ఆమె పార్టీ అడగకపోయినా సరే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతునిచ్చేందుకు దోహదపడింది. ఉపఎన్నికలకు ముందు ఒకరిమీద ఒక రు దుమ్మెత్తిపోసుకున్న ఈ బలహీనతను ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ వాడుకుంటోంది. తెలంగాణవాదం మీద దెబ్బకొ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్‌ను వాడుకోవాలని చూస్తోంది. ఒక దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా ఆ పార్టీ జగన్‌తో ఒక రహస్య ఒప్పందం చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇవన్నీ బలవతంగా చేయిస్తున్నారేమోనని జాలిపడకండి. జగన్, ఆయన కుటుంబం స్వచ్ఛందంగానే సమైక్యవాద పునాదుల్లో పుట్టినవాళ్ళు. ఆయన తన తండ్రిగారి వారసత్వాన్ని చాటుకోవడానికే తన పార్టీకి వాళ్ళ నాయన పేరుమీద వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నారు. ఆ రకంగా సమైక్యవాదం ఆయన వారసత్వ సంపద. దాన్ని తెలంగాణవాదులు ఎంత వ్యతిరేకిస్తే సీమాంవూధులు అంతగా తనని ఆదరిస్తారని జగన్‌కు తెలుసు. ఎంత జైలులో మగ్గుతున్నా ఇప్పుడు జగన్ చేతిలో ఉన్నది డబుల్ బారెల్ గన్!. ఇప్పుడు ఆ గన్నుతోనే తెలంగాణవాదాన్ని కాల్చిపారేయాలని కాంగ్రెస్ తొంద ర పెడుతున్నట్టుంది. కానీ అవేవీ తమ ముందు నిలబడవని రహీమున్నీసా తెలంగాణవాదులందరి తరఫున సిరిసిల్లలో చాటి చెప్పింది. ఇంకా తెలంగాణలో ప్రజాస్వామిక, మానవీయ విలువలు మిగిలి ఉన్నాయి కాబట్టే రహేమ్మున్నీసా తమిళ టైగర్‌లాగా మానవబాంబు కాలేదు, మారణ హోమాన్ని సృష్టించలేదు. కానీ ఆ తెలంగాణ వీర వనిత సాహసం ఇప్పటికీ విజయమ్మ గుండెల్లో అవమాన బాంబు రూపంలో పేలుతూనే ఉండి ఉంటుంది.!

కొసమెరుపు: తెలంగాణవాదులు చరిత్రలో తగిలిన ఒక్క దెబ్బకు ఇప్పుడు వందలు, వేల దెబ్బలు బదులు తీర్చుకునే స్థితిలో ఉన్నారు. కరీంనగర్ బిడ్డ పీవీ ప్రధానిగా కడప వెళితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులచేత శ్రీమాన్ రాజశేఖర్‌డ్డి ఒక చెప్పు విసిరించారు. పాపం ఆయన సతీమణి శ్రీమతి విజయమ్మ గారిని హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా వేలాది చెప్పులు వెంబడించాయి. అవును మరి కొన్నిసార్లు చెప్పులు కూడా తిరగబడతాయి.

సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు
ఈ మెయిల్:ghantapatham@gmail.com

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *