mt_logo

ముంపు మండలాల్లోని ఉద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా..

రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయా మండలాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికులను కూడా ఏపీలో కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అక్కడి ఉద్యోగులు మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేస్తామని ఆప్షన్లు పెట్టుకున్నారు. జీతాలు తీసుకోకుండానే ఉద్యమాలు సైతం చేశారు. అయినా వారి విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఏపీ సర్కారు వారిని ముంపు మండలాల నుండి ఇతర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ వారంతా ఈనెల 9 న ఖమ్మం, భద్రాచలం పట్టణాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు.

ఈ విషయమై రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసి తమ సమస్యలు వివరించారు. దీంతో మంత్రులు తుమ్మల, కడియం శ్రీహరి, ఈటెల రాజేందర్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకటరావు, చీఫ్ సెక్రెటరీ రాజీవ్ శర్మ తదితరులు సీఎం కేసీఆర్ ను కలిసి ఈ విషయంపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ వారిని తెలంగాణలోనే కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. సీఎం ఆదేశాలతో ఉద్యోగుల, ఉపాధ్యాయుల వివరాలు ఇవ్వాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఇలంబర్తిని సీఎస్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ముంపు మండలాల ఉద్యోగులు, ఉపాధ్యాయులను తెలంగాణలోనే కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రంగరాజు, భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *