By: అల్లం నారాయణ
విగ్రహాలు ఊరికే మొలవవు. చెట్లలాగా.. ఊరునిండా విగ్రహాల ఊరేగింపులూ జరగవు. కులీకుతుబ్ షా జమానా హుసేన్‌సాగర్ ఒడ్డున ట్యాంక్‌బండ్ కట్టమీన మొలిచిన విగ్రహాల కథ ఉత్తిదే కాదు. అవి ఉత్తగనే నిర్మితం కాలేదు. ఈ ఒడ్డున ఎన్టీఆర్ గార్డెనూ యథాలాపంగా ఏర్పడలేదు. క్రమం తప్పకుండా పూలు వాడిపోకుండా ఎన్టీఆర్ సమాధి మీద జయంతులూ, వర్ధంతులూ పనిలేక జరగవు. విగ్రహాలకూ స్వభావం ఉంటుంది. స్వరూపం ఉంటుంది. నమూనా ఉంటుంది. ప్రాణంలేని విగ్రహాలు భావజాలాలకు ప్రాణం పోసి ఒక సంపదలా ప్రతీకలై కలకాలం రాజ్యమేలే శాశ్వతముందరి కాళ్ల బంధాలూ అవుతాయి. మనని మనం మరచి విగ్రహాల్లోని మనుషుల పూజలు జీవితాంతం చెయ్యగలిగిన బాంచెతనమూ ఉచితంగా సంప్రాప్తిస్తుంది కూడా. పంజాగుట్టలో రోడ్డు వెడల్పై బంజారా కేఫ్ జ్ఞాపకాలు చెల్లాచెదురయి శిథిలమైపోతాయి కానీ, కొత్త సోకులాడి హైదరాబాద్ సెంట్రల్ మాసిపోదు. దాని ముంగట వైఎస్ విగ్రహమూ మారిపోదు. అది మానని గాయాల ప్రతీక.
ఈ విగ్రహాలు తెలంగాణ నిండా మొలిచినవి కనుకనే ముఖ్యంగా హైదరాబాద్ నిండా ఈ విగ్రహాలు విలసిల్లుతున్నవి కనుకనే, కూకట్‌పల్లిలు, సంజీవరెడ్డి నగర్‌లు, దిల్‌సుఖ్‌నగర్‌లూ పట్నంలో సెటిల్‌మెంట్లుగా విస్తరించినవి కనుకనే, సెక్రటేరియట్ అడ్డాలో అశోక్‌బాబులు ఊడలమర్రులై ఇవ్వాళ విడిపోతే ‘సివిల్ వార్’ హెచ్చరికలు చేస్తున్నరు. దోచిన భూముల నిండా నిండిన వాళ్లు, విగ్రహాలై ఊరేగిన వాళ్లు ఇవ్వాళ హైదరాబాద్ మాదేనని రంకెలు వేస్తున్నరు. ఏకుమేకైన శాస్త్రం. తెలంగాణ ఉద్యమం శాంతిని నమ్ముకున్నది కనుక, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నమ్ముకున్నది కనుక ఏకుమేకైన వాళ్లను, ‘దూదేకుదుమ్మేకు’ నినాదంగా తీసుకోలేదు. 1969 పునరావృతం కాలేదు. అయితే ఇవ్వాళ్ల హైదరాబాద్‌లో సౌకర్యాల కోసం ఇల్లు సొచ్చిన సీమాంధ్ర దౌష్ట్యం యాభై ఆరేళ్ల తర్వాత ఫతేమైదాన్ దండయాత్రకు తెగబడేది కాదు. కడప నుంచి, చంచల్‌గూడ జైలు నుంచి తాజాగా వచ్చిన సీమాంధ్ర ముండ్లజెముడు సభ జరిగేదే కాదు. మూలం యాభై ఆరు సంవత్సరాలలో అంతర్గత వలస ఆధిపత్యం సాధించుకున్న సామ్రాజ్యాల్లో ఉంది. మూలం కొల్లగొట్టిన భూముల్లో ఉంది.
మూలం నిరాటంకంగా ఎత్తుకుపోయిన నీళ్లల్లో ఉంది. మూలం తన్నుకుపోయిన కొలువుల్లో ఉంది. మూలం ఇక్కడి ప్రజల మనోభావాలను నియంవూతించి, ఆక్రమించుకున్న, బానిస యంత్రాంగాలను తయారుచేసి పెట్టిన మీడియా కుట్రబాజీ ‘థాట్ పోలీసింగ్’లో ఉన్నది. ఆక్రమించుకున్న సామాజిక, సాంస్కృతిక, చారివూతక, రాజకీయ ఆధిపత్యాల్లో ఉన్నది. ఆ మూలాల వికృత స్వరూపాలు, ఆధిపత్యపు అహంకారాల అసలు రూపాలు, పరిణామాలు టాస్క్‌ఫోర్స్ కమిటీల్లో, ఆంటోనీ కమిటీల్లో, జై రాం రమేష్ నివేదికల్లో ప్రతిఫలిస్తూ ఉన్నవి. బహుపరాక్. ఆప్రమత్తం. తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదు. అది ఊపిరిపోసుకుంటున్నది.
తెలంగాణ ఉద్యమం నివురుగప్పిన నిప్పులా ఉన్నది. సంపూర్ణ తెలంగాణ, సీడబ్ల్యూసీ తీర్మానంలో చెప్పిన పది జిల్లాలతో కూడిన, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ తప్ప మరేదీ అంగీకారం కాదు. మరేదీ పరిష్కారం కాదు. అది తప్ప మరో దారీ లేదు. ఇప్పుడు మాట్లాడవచ్చు. విగ్రహ ప్రతీకలను, భావజాలాలను, ఉచ్చులను, మప్పితంగొన్న మార్మిక మాటలను, బానిసలను తయారు చేసిన మీ యంత్రాంగాల అసలు స్వరూపాన్ని కనిపెట్టింది కనుకనే తెలంగాణ తండ్లాడుతున్నది. తెలుసుకున్నది కనుకనే తెలంగాణ లెక్కలు తీసింది. దోపిడీని పసిగట్టింది. దోపిడీ అంతరంగాన్నీ దుర్భిణీలు వేసి పరిశోధించింది. ఫలితమే మళ్లీ మళ్లీ తెలంగాణ. ఇప్పుడిక మార్గమే లేదు. తెలంగాణకు అన్నీ తెలుసు.. జాగ్రత్త..
ముందువాళ్లు విభజన కుదరదు అన్నారు. డిసెంబర్ 9, జూలై 30 తేదీలు విభజన అనివార్యమని తేటతెల్లం చేశాయి. విభజన అనివార్యమైనాక వాళ్లు రాజ్యాంగస్ఫూర్తినీ ప్రశ్నించారు. తీర్మానమా? బిల్లా? అన్నారు. అందరినీ సంప్రదించమన్నారు. అఖిలపక్షమూ అన్నారు. ప్రైవేట్ కమిటీ వేస్తే, ప్రభుత్వ కమిటీ కావాలన్నారు. ప్రభుత్వ కమిటీ వేస్తే ప్రధానికి లేఖలు రాశారు. రాజ్యాంగం ప్రకారమే జరిగిందంటే రాష్ట్రపతిని కలుస్తామన్నారు. 371 ‘డి’తో ఢీకొంటామన్నారు. ప్రతీఘాత ఉద్యమాలూ డిజైన్ చేశారు. పిల్లల చదువులు నాశనం చేసి, ఇక కుదరక వీధులు నిశ్శబ్దమైనాక, సమన్యాయం అన్నారు. న్యాయమే లేదని తెలంగాణ అంటే సమన్యాయ నినాదాలూ చేశారు. కొలువులు కొట్టుకుపోయారని నిరూపిస్తే, ఆక్రమించుకున్న కొలువులకు అధీకృత ముద్ర కావాలన్నారు. నీళ్లు దొంగిలించారంటే, నీటి యుద్ధాలు అన్నారు. భూములు ఆక్రమించారంటే, హైదరాబాద్ మాదే అన్నారు.
చివరికి ఇన్నాళ్లకు, విభజన ఇక అనివార్యమైన వేళ ఢిల్లీలో చక్రాలు తిప్పి, హైదరాబాద్ పైన గవర్నర్ గిరీ అంటారు. రేపు పొద్దున తెలంగాణ వచ్చినా కడుక్క తాగడానికి కూడా పనికి రాకుండా పెత్తనం మాదే.. ఉత్త తెలంగాణ మీది… తీసుకోండి అంటారు. ఆత్మగౌరవం భంగపడిందంటే, మా సంస్కృతీ విధ్వంసం జరిగిందంటే, విగ్రహాలు బద్దలయ్యాయని లబలబలాడతారు. అందుకే విగ్రహాలు ఊరికే మొలవవు చెట్లలాగా. విగ్రహాలు ఆధిపత్యం కోసం, ఆధిపత్య స్థాపన కోసం, తలెత్తి ప్రశ్నించలేని బానిసత్వంలోకి మనిషి జారిపోవడం కోసం రూపొందిన నమూనాలు. ఇప్పుడిక హైదారాబాద్ కాదు. ఇంచు జాగా విడిచిపెట్టదు తెలంగాణ. ఒక సంపూర్ణ తెలంగాణ. ఆత్మగౌరవం కోసం, నీళ్లు, నిధులు, కొలువుల కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం జరిగింది తెలంగాణ పోరాటం. దశాబ్దాల ఆరాటం. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం నిలబడుతుంది తెలంగాణ.
హైదరాబాద్. ఇప్పుడు మనది కాదు. ‘సిర్ఫ్ హమారా’ అవును హైదరాబాద్ మాది మాత్రమే.
ప్రాంతీయ అస్తిత్వ పోరాటాలకు పరిమితులు ఉంటాయి. రాజ్యాంగ పరిధిలో, రాజకీయ ప్రక్రియతో సాగాల్సిన అస్తిత్వ ఉద్యమానికి ప్రజాస్వామ్య పరిధిలోనే పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ మేరకు దానికి పరిమితులూ ఉంటాయి. సంప్రదింపులూ ఉంటాయి. ఇచ్చిపుచ్చుకోవడాలూ ఉంటాయి. చర్చలకు ఆస్కారమున్నవీ ఉంటాయి. సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేవి ఉంటాయి. రాజ్యాంగ స్ఫూర్తిని ఉభయ ప్రాంతాలు, ఉభయ ప్రాంతాల నేతలూ ప్రదర్శించినప్పుడు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
అట్లాగే సంప్రదింపులకు ఏమాత్రం ఆస్కారం లేని అంశాలూ ఉంటాయి. 1956కు పూర్వం, విలీనానికి ముందున్న భౌగోళిక స్వరూపంతో కూడిన తెలంగాణ, భద్రాచలంతో సహా సరిహద్దులు గల తెలంగాణ, పూర్తిగా ఒక ప్రాంతపు రాజధానిగా ఎలాంటి ఆంక్షలు, అధికారాలు, పెత్తనాల పరిమితులు లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అనేది సంప్రదింపులకు ఏమాత్రం ఆస్కారం లేని అంశం. దీనిమీద మరోమాట ఉండే అవకాశం లేదు. దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఉన్న అన్ని స్వతంత్ర లక్షణాలు, అధికారాలు, హక్కులు ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణకూ ఉంటుంది. తెలంగాణ తనను తాను పరిపాలించుకోగలదు. అందరికన్నా మెరుగైన పాలనతో, తెలంగాణ తాను నిలబెట్టుకోగలదు సీమాంధ్ర సంకుచిత, స్వార్థపర శక్తుల కన్నా మిన్నగా… కించపరచాలనుకుంటే, తక్కువ చేసి చూపాలనుకుంటే, సామర్థ్యం, శక్తి లేనివారని, నిమ్నులుగా తెలంగాణ వారిని భావిస్తే మాత్రమే హైదరాబాద్ మీద అధికారం అడగాలి. నిజమే అది మమ్మల్ని మళ్లీ కించపరిచినట్టే. హైదరాబాద్‌లో విలసిల్లి శతాబ్దాలుగా బతుకుతున్న అన్ని భాషల, అన్ని జాతుల , అన్ని కులాల,అన్ని ప్రాంతాల, అన్ని మతాల, సమరస, భావన విలువతోనే సీమాంవూధులూ బతుకుతారు. వారికి ప్రత్యేక చట్టాలా, రక్షణలూ కోరడం అంటే నే ఒక చిచ్చు, ఒక రచ్చ, ఒక కలిసుండలేని విడిపడిన భావాలను పెంచి పోషిస్తున్న విద్వేషమే. జాగ్రత్త… హైదరాబాద్ మీద అధికారం సంప్రదింపుల అంశం కానేకాదు.
మౌనమూ, సంయమనమూ బలహీనత కాదు. అవసరమైన సందర్భాల్లో ఇవి రెండూ ఆయుధాలు. తెలంగాణ ఉద్యమం మూడు నెలలకు పైబడి వ్యూహాత్మకంగా మౌనంలో ఉన్నది. అవసరానికి మించి మాట్లాడకుండా, కార్యాచరణ కూడా పరిధులు, పరిమితులకు లోబడి చేపడ్తున్నది. లోపల ఉధృతంగా కదలాడే చలనాచలన భావోద్వేగాలను అదుపు చేసుకుని ఆచితూచి వ్యవహరిస్తున్నది. కానీ అది తెలివిడిగానే ఉన్నది. మేల్కొని ఉన్నది. ఒకవేళ ఆంటోనీ కమిటీ సిఫారసులే, బిల్లుల్లో ఉంటే, టాస్క్‌ఫోర్స్ నివేదికలోని హైదరాబాద్ ఆక్రమణ అంశాల, జలవనరులకు సంబంధించి జైరాం రమేష్ సిఫారసులు బిల్లులో ఉంటే ఈ వ్యూహాత్మక మౌనం బద్దలవుతుంది.కాంగ్రెస్ పార్టీకి నిజంగానే తెలంగాణ ఇవ్వాలని ఉంటే, రాజకీయ స్వీయ ప్రయోజనాలు కూడా కాపాడుకోవాలని ఉంటే సీడబ్ల్యూసీ తీర్మానానికి మించి అటుగానీ, ఇటుగానీ ఒక్క ఇంచు జరిగినా తెలంగాణలో మళ్లీ యుద్ధం బద్దలవుతుంది.
1969లో ఆంధ్రా గోబ్యాక్ ఉద్యమం స్వరూప స్వభావాలను చూశారు. వాటికి పూర్తిభిన్నంగా ‘మా తెలంగాణ మాగ్గావాలె’అని తనను తాను హింసించుకున్న ఉద్యమాన్ని మాత్రమే చూశారు. కానీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగినా, ప్రజాస్వామ్యస్ఫూర్తికి విఘాతం కలిగినా, శాంతి భగ్నమవుతుంది. తప్పదు. తెలంగాణ ఉద్యమం స్వీయ నియంవూతణలో, కొండంత గుండెతో, పుట్టెడు ఓపికతో ఉన్నది. అది బద్దలైతే ఈసారి ప్రజాస్వామ్య భావజాలాలూ కూలుతాయి. బహుశా ఊరికే మొలవని విగ్రహాల భవిష్యత్తూ ప్రశ్నార్థకమే అవుతుంది..‘దూదేకు.. దుమ్మేకు.. పాలగోకు పెడుత బాగేకు… బాగేకు’ ఒక నినాదమై ఆకాశం నిండా ప్రతిధ్వనిస్తుం ది. విచక్షణ గలవారైతే, బుద్ధికుశలత ఉన్నవారైతే, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వాళ్లైతే ‘సంపూర్ణ తెలంగాణ’ ఇవ్వండి లేదా విపరిణామాలకూ సిద్ధపడండి. జాగ్రత్త… జాగ్రత్త.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో ]