mt_logo

టీ కాంగ్రెస్ నేతల మధ్య పెరిగిన దూరం!

తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న ఐక్యత ప్రస్తుతం కనిపించడంలేదని, దీనికి కారణం ఆశించిన పదవులు దక్కకపోవడమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమే అని ప్రచారం చేస్తూ పార్టీని గెలిపించాల్సిన సమయంలో ఇలా వారంతా చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారడం చూస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయసమీకరణాల్లో జరుగుతున్న మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. వారంతా కలిసి నడుస్తారనే సంకేతాలు ఏమాత్రం కానరావట్లేదు. ముఖ్యంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షపీఠం ఆశించిన సీనియర్ నేతలు జానారెడ్డి, డీ శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి తదితరుల్ని కాదని పొన్నాలకు పీసీసీ పదవి కట్టబెట్టడం అందర్లో అసంతృప్తిని రగిలించింది. స్వయంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నచ్చచెప్పినా సీనియర్ల మధ్య ఐక్యత కుదరడం లేదు. కేంద్రమంత్రి జైరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ లు హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఒకే వేదికపై కనిపించారని, తర్వాత మళ్ళీ కలవలేదని, వారిలో పదవులపై వ్యామోహం తప్ప పార్టీని గెలిపించుకునే ప్రయత్నాలు చేయట్లేదని జాతీయ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఈ నెల 30న తెలంగాణలో మున్సిపల్, ఏప్రిల్ లో స్థానిక, సార్వత్రిక ఎన్నికలుండగా పార్టీ సీనియర్లు ఏమాత్రం ప్రచారకార్యక్రమాలపై దృష్టి పెట్టకపోవడం చూసి కార్యకర్తలు నిరుత్సాహపడుతున్నారు. పార్టీ సీనియర్ల ప్రచారం లేకుండానే మున్సిపల్ ఎన్నికల పోరు పూర్తికానుంది. టిక్కెట్ల లాబీయింగ్ కోసం ఢిల్లీకి హైదరాబాద్ కు పరుగులు పెడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *