mt_logo

తెలంగాణ ప్రాంత ఇంటర్, 10th పేపర్లు తెలంగాణలోనే దిద్దాలి..

తెలంగాణ ప్రాంతానికి చెందిన 10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలను ఇక్కడే దిద్దాలని పలువురు తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 19నుంచీ ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష జవాబుపత్రాల స్పాట్ వాల్యుయేషన్ లో పాతపద్దతినే అనుసరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏ ప్రాంత పేపర్లు ఆ ప్రాంతంలోనే దిద్దాలని తెలంగాణవాదులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. సీమాంధ్రలో తెలంగాణ ప్రాంత పేపర్లు దిద్దితే వివక్ష చూపించడానికి అవకాశమున్నందున వారంతా ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 15నుండీ ప్రారంభం కానున్న 10వ తరగతి పేపర్లు దిద్దటంలోనూ పాత విధానమే అనుసరించేందుకు అధికారులు సిద్ధమౌతున్నారని తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాని కారణంగా పాత పద్ధతిలోనే వాల్యుయేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ వాదులనుండి వచ్చిన డిమాండ్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు విద్యాశాఖకు పంపించినా అక్కడి అధికారులు పట్టించుకోకుండా పాత విధానం ద్వారానే మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారుల ఆదేశాలమేరకు ఇంటర్ బోర్డు ఈ నెల 19న ఒక ప్రాంతం జవాబు పత్రాలు మరో ప్రాంతానికి పంపింది. జాతీయస్థాయి విద్యాసంస్థల్లో అడ్మిషన్లకై నిర్వహించే ఎంట్రన్స్ పరీక్షల్లో 40% వెయిటేజీ, మన రాష్ట్రంలోని మెడికల్, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలంటే 25% వెయిటేజీ ఉండాలి. ఎవరైనా లెక్చరర్లు ప్రాంతీయ అసమానతలు చూపిస్తే విద్యార్థులు దారుణంగా దెబ్బతిని సీట్లు కోల్పోయే ప్రమాదముందని వారంతా హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *