mt_logo

ధర్మపురి ఇథనాల్ పరిశ్రమ స్థల సన్నద్ధత బాధ్యతలు టీఎస్ఐఐసీకి : మంత్రి కేటీఆర్

ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో ప్రఖ్యాత క్రిభ్‌కో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఇథనాల్‌ పరిశ్రమ సన్నద్ధతకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ 13 కోట్లు కేటాయించారు. ఇదివరకే గోదావరి నది సమీపంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో పరిశ్రమ ఏర్పాటుకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వ భూమిని అధికారులు పరిశీలించి, 413 ఎకరాలను పరిశ్రమకోసం కేటాయించారు. ఈ స్థలంలో దాదాపు వంద ఎకరాల మేర ఉన్న గట్టు ప్రాంతాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం మంత్రి కేటీఆర్‌ 13 కోట్లను కేటాయించడంతో పాటు, స్థల సన్నద్దత పనులను టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

వ్యవసాయ రంగంలో గొప్పగా పేరుగాంచిన జగిత్యాల జిల్లాలో వ్యవసాయాధారితమైన భారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ఎరువుల ఉత్పత్తిలో కీలకమైన క్రిభ్‌కో సంస్థ ద్వారా ఇథనాల్‌ పరిశ్రమను ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేయాలని గత ఏడాది నవంబర్‌ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, మరియు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ల సహకారంతో క్రిభ్‌కో సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దాదాపు 700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ వల్ల అటు రైతాంగానికి, మరోవైపు యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఏటా 8 కోట్ల లీటర్ల రైస్ బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పడనున్న ఈ పరిశ్రమకు ఏడాదికి 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి, మొక్కజొన్న వినియోగించనున్నారు.

గోదావరినది అందుబాటులో ఉండటం వల్ల పుష్కలమైన నీటి వసతి, రహదారి అవకాశాలు మెరుగ్గా ఉండటం, క్రిభ్‌కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రామగుండం ఎరువుల కర్మాగారం సమీపంలో ఉండటం వంటి సదుపాయాలను పరిశీలించిన క్రిభ్‌కో చైర్మన్‌, వైస్ చైర్మన్‌, డైరెక్టర్లు గత డిసెంబరులో ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రకటించారు.

పరిశ్రమ స్థల ఏర్పాటు బాధ్యతలు టీఎస్ఐఐసీకి : మంత్రి కేటీఆర్

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థల సన్నద్దత బాధ్యతలను టీఎస్ఐఐసీకి అప్పగిస్తున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయమై హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, టీఎస్ఐఐసీ చైర్మన్‌ నర్సింహరెడ్డి, క్రిభ్‌కో సంస్థ తెలంగాణ ప్రతినిధి, ఇథనాల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాంరెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకానితో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఏర్పాటును ప్రతిపాదించిన స్థలంలో కొంత భాగంలో గుట్టబోరు ఉండటం కొంత ఇబ్బందికరంగా ఉందని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఇవి అడ్డంకిగా ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రతిపాదిత స్థలంలో గుట్టలను చదును చేయాలని నిర్ణయించారు. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలంలోని గుట్టబోరును తొలగించి, ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని సన్నద్దం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గుట్టబోరు స్థలాన్ని చదును చేసి, ఫ్యాక్టరీ నిర్మాణానికి స్థలాన్ని అనువుగా మార్చేందుకు 13 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 700ల కోట్ల విలువైన ఫ్యాక్టరీని మంజూరు చేయడంతో పాటు, స్థల సన్నద్దతకు సైతం నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఈశ్వర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *