రంగారెడ్డి-మహబూబ్ నగర్-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీ. దేవీప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసే సమయంలో దేవీప్రసాద్ తో పాటు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉద్యోగసంఘాల నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ, అన్ని జిల్లాల ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని, అందరూ ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ఉద్యమంలో నేను చేసిన కృషి అందరికీ తెలుసు. గత ఉద్యమాలు పాలకులకు వ్యతిరేకంగా జరిగినవే అని చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఈ సందర్భంగా దేవీప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హోంమంత్రి నాయిని మాట్లాడుతూ, పార్టీ శ్రేణులు, విద్యావంతులు అందరూ కలిసి దేవీప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని, ఉద్యమంలో దేవీప్రసాద్ పాత్ర కీలకమని, సకలజనుల సమ్మె విజయవంతం చేసిన ఘనత దేవీప్రసాద్ కే దక్కుతుందని అన్నారు.