రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరుకూడా డెంగ్యూతో చనిపోలేదని, ప్రతిపక్ష నేతలు డెంగ్యూపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో డెంగ్యూ మరణాలు లేవని, భద్రాచలం ఏజెన్సీలో విషజ్వరాలు రాకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను భయాందోళనకు గురిచేస్తున్నాయన్నారు. రోగులనుండి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, అలా వసూలు చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై చేసే దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు.