mt_logo

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదు – హరీష్ రావు

ఏపీలో కరెంట్ కోసం శ్రీశైలం ప్రాజెక్టులో జలవిధ్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణా రివర్ బోర్డుకు బాబు ఎలా లేఖ రాస్తారని, హరిహరబ్రహ్మాదులు అడ్డొచ్చినా, చంద్రబాబు అరిచి గీ పెట్టినా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపే ప్రసక్తే లేదని భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మంగళవారం మెదక్ జిల్లా సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లో పర్యటించిన అనంతరం హరీష్ రావు కోదండరావుపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ఒప్పందాలను ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారని, ఏపీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న ఒప్పందాన్ని లెక్కచేయకుండా తెలంగాణలో కరెంట్ కోతలకు కారణమయ్యారని మండిపడ్డారు. పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి ఒప్పుకున్నామని, మీ కార్యాలయాలు ఇక్కడే ఉన్నాకూడా మేము మీకు ఇబ్బందులు కలిగించలేదని, ఒప్పందాలకు మేము కట్టుబడి ఉన్నామని హరీష్ రావు పేర్కొన్నారు.

పంటలు ఎండిపోకూడదనే ఉద్దేశంతోనే శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, రైతాంగాన్ని ఆదుకోవడానికి రోజూ రూ. 15 కోట్ల రూపాయలతో విద్యుత్ ను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నామన్నారు. పరిశ్రమలకు రెండు గంటలు కోత విధించైనా రైతాంగానికి 6 గంటల విద్యుత్ ను అందిస్తున్నామని, చంద్రబాబు కుట్రలపై తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నోరుమెదపడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *