mt_logo

డెడ్‌లైన్.. డిసెంబర్ 28: కోదండరాం

Photo: డిసెంబర్ 9 ప్రకటన మూడవ వార్షికోత్స్వం సందర్భంగా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సదస్సులో మాట్లాడుతున్న ఎండీ సి.ఎల్.రాజం, ఫొటోలో పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ, జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ కేశవరావు, బిజేపీ నేత ఇంద్రసేనారెడ్డి. ఉద్యోగసంఘాల నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.      

ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న అఖిలపక్ష సదస్సులో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ లు తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా అభిప్రాయం ప్రకటించాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు.

ఈ మూడు పార్టీల్లోని తెలంగాణ ప్రాంత నాయకులు ఆ పార్టీల్లోనే ఉండి తెలంగాణ తెస్తమంటే ఇక ఉపేక్షించేది లేదన్నారు.

నమస్తే తెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిసెంబర్-9 సదస్సులో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్ర దీపాన్ని ఆర్పేద్దాం-నమస్తే తెలంగాణ దీపాన్ని వెలిగిద్దాం’ అన్న కోదండరాం.. తెలంగాణ రాష్ట్ర కోసం కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష, ఆయనకు మద్దతుగా విద్యార్థి లోకం, గ్రామాల్లో జనం కదిలి వచ్చిన సంఘటనలను కోదండరాం గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటాన్ని కొనసాగిస్తున్నామని, అయితే ఉద్యమంలో తెలంగాణ రాజకీయ నాయకుల పాత్ర పరిమితంగా ఉందని అన్నారు. ఉద్యమానికి టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ వంటి పార్టీలు అండగా నిలుస్తుంటే, తెలంగాణ పేరుతో గెలిచిన పార్టీలు మొండి చేయి చూపించాయన్నారు.

గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయిలో పర్యటించి రాజకీయ నాయకులను ప్రత్యక్షంగా కలిసి వాళ్ల వైఖరి ఏందో అడుగుతామని, అందుకు తగిన కార్యాచరణను జేఏసీ రూపొందిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు మంత్రి పదవులు తీసుకొని ముఖ్యమంత్రి పక్కన తిరుగుతున్నారని, వారిపై తిరుగుబాటు చేయడం పెద్ద విషయం కాదని హెచ్చరించారు. పోరాటానికి రాజకీయ వ్యక్తీకరణ కావాలని, అందుకు అందర్నీ ఐక్యం చేసే దిశగా టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ వంటి పార్టీలు కలిసిరావాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఈ పార్టీలు నిబద్ధతతో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ తమ వైఖరి ఏమిటో చెప్పేందుకు ఆ పార్టీల్లోని తెలంగాణ నాయకులే బాధ్యత తీసుకోవాలన్నారు. ‘లేదంటే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులను తయారు చేస్తాం. అదేమంత కష్టం కాదు. బలమైన ఉద్యమం ఈ శక్తులను ముందుకు తీసుకెళుతుంది. ఉద్యమం నుంచి రాజకీయ ప్రక్రియ వేరు చేయవద్దు.సమాంతరంగా ముందుకుసాగాలి’ అని చెప్పారు.

[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *