mt_logo

నయవంచనకు మూడేళ్ళు

By: విశ్వరూప్ 

సరిగ్గా మూడేళ్ళక్రితం ఇదేరోజు…కేసీఆర్ దీక్ష ఫలితమో, విద్యార్థుల ఉద్యమఫలమో గానీ భారత ప్రభుత్వం తరఫున హోంమంత్రి చిదంబరం తెలంగాణపై ప్రకటన జేసిండు. తెలంగాణ ప్రక్రియ మొదలయింది..త్వరలో యూపీయే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జేస్తుంది అని ప్రకటన జేసిండు. తమ యాభై ఏళ్ళ కల నెరవేరిందని తెలంగాణ ప్రజలు సంబరపడ్డరు.

కానీ సంబరాలు ఎక్కువసేపు నిలువలేదు. అప్పటిదాక తెలంగాణకు మేము ఎక్కువ అనుకూలమంటే కాదు మేమే ఎక్కువ అనుకూలం అంటూ పోటీలు పడ్డోళ్ళు, ఇచ్చేది తెచ్చేది మేమే అంటే మీకు దమ్ముంటె బిల్లు బెట్టున్ర్డి మేం మద్దతు ఇయ్యకపోతె అడుగుండ్రి అన్నోళ్ళు, మేము సామాజిక తెలంగాణ తెస్తం కావాలంటె మామానిఫెస్టో జూడుండ్రి అని ఫోజులు గొట్టినోళ్ళు వాళ్ళూ వీళ్ళు అందరు ఒక్కటై ఒకరి ఎనకాల ఇంకొకరు లైనుగట్టినట్టు రాత్రికి రాత్రి రాజీనామాలు జేసిండ్రు. చరిత్రలో ఎక్కడలేనట్టు తమకు కావాల్సినదానికోసం గాకుండ ఎదుటివారికి వచ్చేది ఆపడానికి ఉద్యమం (?) మొదలు పెట్టిండ్రు. వోట్లకోసమైతె జైతెలంగాణ, అధికారం, డబ్బుకోసమైతె నైతెలంగాణ అని తమ నైజం బయట పెట్టిండ్రు.

ఫాక్షనిస్టు కౄరమృగాలు జింకపిల్లలెక్క నటించి గాంధీగిరీ జూపించి దీక్షలు జేసిండ్రు, సాటుంగ వాల్లే వల్ల కిరాయి మనుషులను ఉసిగొల్పి లూటీలు జేసి, బస్సులు తగలబెట్టి విధ్వంసం జేసిండ్రు. ఎప్పుడు కొట్టుకుని తిట్టుకునే బెజవాడ రౌడీలు ఒక్కటై నిరాహారదీక్షలు జేసిండ్రు, విద్యార్థులను రెచ్చగొట్టి బంద్‌లు జేయించిన్రు. ఆడ మొగ తేడాలు మరిచిపొయి నన్నపనేనులు, లగడపాటులు సిగ్గువిడిచి కౌగిలింతలూ, ముద్దులూ కురిపించుకుండ్రు. ఏలినాటి పగలున్న ముఠాకక్షల శతృవులు ఏకమై నాటకాలు జేసిండ్రు.

“మన పక్కోడు మన కింద అనిగి ఉన్నంతవరకే నువ్వూ నేను శతృవులం. మనం మనం బాగనే ఉండాలి గని మనకింద ఉన్నోళ్ళు మనకోసం కొట్టుకు చావాలి. మనకిందోడు తెలివిమీరి మన అదుపునుండి బయటికి వస్తే అప్పుడు మనం శతృత్వం మరిచిపోవాలి,నువ్వు నేను ఒక్కటై కిందోన్ని అణగదొక్కాలి” గిదే ఫాక్షనిస్టు నీతి. గిదేనీతి డిసెంబరు 9, 2009 తరువాత సీమాంధ్ర నాయకులు జూపిండ్రు. అప్పటిదాక తెలుగుదేశం, కాంగ్రేస్ తరఫున కులగజ్జి, ముఠాకషలతో కొట్టుకునేటోళ్ళంత తెలంగాణ వస్తుందనగానె ఎక్కడ కబ్జాలు చెయ్యిజారిపోతయో, ఎక్కడ ఆధిపత్యం తగ్గిపోతుందోనని భయంతో శతృత్వాలను మరిచిపోయి ఫాక్షనిస్టు నీతిననుసరించి ఒక్కటై తెలంగాణకు అడ్డుపడ్డరు.

పదిహేను రోజులు వరస బందులు జేసిండ్రు. బస్సులు నడవనియ్యలేదు. బడి పిలగాళ్ళను బడికి పోనీయకుండ రోడ్లమీద కూసోపెట్టిండ్రు. గోడౌన్లు కాలపెట్టిన్రు. ఎక్కడికక్కడ టేంట్‌లేసి దీక్షలని గూసుండ్రు…రింగ రింగ పాటలు పెట్టుకుని డాన్సులు జేసిండ్రు. గక్కడ గోడౌన్లు గాలపెడుతుంటే పోలీసులు ప్రేక్షకుల్లెక్క గూసుండ్రు గని అడ్డుజెప్పలేదు. బడిపోరగాళ్ళతోని ర్యాలీలు తీపిస్తుంటె అడ్డుజెప్పలేదు.. రాష్ట్ర ప్రభుత్వమే అలజడి దగ్గరుండి జరిపిస్తుంటె అడ్డుకునేదెవరు? ఎన్ని లూటీలు జేసినా ఒక్క అరెస్టు గుడ లేదు.

ఈ దొంగడ్రామాలకు మీడియా తోడు. చేతిలో మీడియా ఉంటె పదిమంది వచ్చిన సమైక్యాంధ్ర జాక్ సభ గూడ  మహాసభ అయితది. బడిపోరగాండ్లతో తీయించిన ర్యాలీ గూడ మొదటి పేజీలో పెద్దపెద్ద అక్షరాలతో వస్తది. రోజు బిర్యాని పొట్లాలు తింటున్నా గూడ  మహోన్నత నిరాహారదీక్ష అవుతుంది, టీవీలల్ల పది నిమిషాలకోసారి ఫ్లాష్ న్యూస్‌లొస్తయి. డబ్బుంటే రెచ్చగొట్టుడు వీడియోలు తీయించి పావుగంటకోసారి అన్ని ఛానెళ్ళలో జూపించొచ్చు. అధికారముంటె లూటీలు జేసినా అడిగేటోల్లుండరు, మీడియా మనదయితె నక్క గూడ నాగలోకమయితది. ఇంకేం గావాలె? ఈ దొంగనాటకం ఢిల్లీ నేతల కండ్లకు పెద్దగ గనపడ్డది. అది గాకుండ దొంగ డ్రామా రాజీనామాలు తప్పుడు ఫార్మాట్‌లో ఇచ్చి బ్లాక్‌మెయిలు గుడ జేసె. ఎక్కడ ప్రభుత్వం గూలిపోద్దోనని భయపడి యూపీయే ప్రభుత్వం ఇచ్చిన మాట వెనక్కి దీసుకుంది, తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంది.

మూడేండ్లు గడిచిపొయినయ్. వందల యువకులు తెలంగాణలో ఆత్మబలిదానాలు జేసుకుండ్రు. వేలమంది లాఠీ దెబ్బలల్ల గాయపడ్డరు, లక్షలమంది ఉద్యమాలు జేసిండ్రు, కోట్లమంది హృదయాలు గాయపడ్డయ్. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మాత్రం ఇంకా ఎక్కడవేసిన గొంగడి అక్కడనే అన్నట్టున్నది.

చూస్తుండంగ మల్లి వోట్లు దగ్గరపడ్డయి. భూమి గుండ్రంగ ఉంటదన్నట్టు పార్టీల పగటి వేషగండ్లు నాటకాలు షురు జేసిండ్రు. పాదయాత్రలు, పొర్లు దండాలు మొదలు పెట్టిండ్రు. బిల్లుపెట్టి సూపించుండ్రి మద్దతియ్యకపోతె అడుగుండ్రి అని సవాలు జేసిన నోటితోటే గంటలల్ల మాటమార్చి ఎవర్నడిగి నిర్ణయం తీసుకుండ్రు అన్న మోసగాడు “నేను తెలంగాణకు వ్యతిరేకం గాదు” అంటుండు. పార్లమెంటులొ పక్కోడిదగ్గర ప్లకార్డు గుంజుకుని తెలంగాణకు వ్యతిరేకంగ అరిచినోడు ఇప్పుడు మీ మనోభిప్రాయలకు అనుగుణంగ ఉంటమని పెద్దపెద్ద మాటలు జెబుతుండు. ఎంత సిగ్గులేకపోతెమాత్రం మరీ వోట్లకోసం గిన్ని అబద్దాలా? ఇన్ని మోసాలు జేసి ఏం బావుకుంటరు?

మీ దొంగ ఉద్యమం వల్ల ఒక్కటిమాత్రం మంచిదయింది. తెలంగాణలో మూడేళ్ళకింద చానమంది నా అసుంటొల్లు “తెలంగాణ తెచ్చుకుని జేసేదేముంది, దానికోసం ఎందుకు కష్టాలు ఎట్లనో ఒకలాగ ఉండెడానికి” అనుకునేటోళ్ళు. మీ దొంగ ఉద్యమంతో అప్పటిదాక తటస్థంగ ఉన్న చానమందికి వాస్తవం తెలిసొచ్చింది. నీకీ పొత్తులో ఎంతలాభం లేకుంటె గీ తీరుగ మా రాష్ట్రానికి అడ్డుపడుతవ్ బిడ్డ, అధికారం చేతిలో పెట్టుకుని నువ్వు మా సొమ్మెంత దోసుకోకపోతె మా వాటా మాగ్గావలంటె ఏడుస్తున్నవ్ అనుకున్నరు. లెక్కలు బయటికి తీసిండ్రు, చరిత్ర తెలుసుకున్నరు, యాభై ఏళ్ళుగ సమైక్యం పేరుతో జరుగుతున్న మోసాన్ని తెలుసుకున్నరు. ఇప్పుడు మీరు పాదయాత్రలు జేసినా, పొర్లు దండాలు పెట్టినా మీకెవ్వరు వోటేశేది లేదు. సీమాంధ్రపార్టీలనన్నింటినీ ఎప్పుడో మా దగ్గర బొంద పెట్టినం.

మీరిచ్చే కుక్క బిస్కెట్ల ఆశకు మాదగ్గర హౌల గళ్ళు కొందరు మీ పార్టీలల్ల జేరుతున్నరని మురిసిపోకుండ్రి. వాల్లకు ఇంకే తెలంగాణ అనుకూల పార్టీల టికెట్ రాదని తెలిసి మీడబ్బుకోసం వస్తుండ్రు. అంత మూన్నాళ్ళ ముచ్చటే. మీదోపిడీ ఇంక సాగదు, సామాను సర్దుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *