బీజేపీ పార్టీ తీరు నచ్చక ముఖ్యనేతలంతా ఆ పార్టీ వీడుతున్నారు. ముఖ్యంగా మునుగోడు ఉపఎన్నికల్లో ఆ పార్టీ తీరు, అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తీరు నచ్చక మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య ఆ పార్టీకి రాజీనామా చేయగా, నేడు మరో అతిముఖ్య నేత దాసోజు శ్రవణ్ ఆ పార్టీని వీడారు. ఇప్పటికే అనేకమంది మండలాధ్యక్షులు, కార్యకర్తలు బీజేపీని వీడగా…శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ కూడా ఆ పార్టీని వీడుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా బీజేపీని వీడిన దాసోజు శ్రవణ్ ఈరోజు సాయంత్రం టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే శ్రవణ్ తన రాజీనామా లెటర్‌ను బండి సంజయ్‌కు పంపించినట్లు తెలుస్తోంది.
బీజేపీ సిద్ధాంతాలతో తెలంగాణకు చేటు :
‘బీజేపీలో దశ, దిశ లేని రాజకీయాలున్నాయి. బీజేపీలో బలహీన వర్గాలకు స్థానం లేదు. మునుగోడులో బీజేపీ అనుసరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. కాంట్రాక్టర్లు డబ్బులతోనే రాజకీయం నడుస్తోంది అనుకుంటున్నారు. బీజేపీ సిద్ధాంతాలు తెలంగాణ సమాజానికి ఏమాత్రం ఉపయోగంలేనివి’ అని దాసోజు శ్రవణ్ తన రాజీనామాలో పేర్కొన్నారు. ప్రజాహితమైన పథకాలు, సిద్ధాంతాలు రూపొందించటం కంటే ఎన్నికల్లో డబ్బు, మాంసం పంచడంపైనే బీజేపీ దృష్టి పెట్టిందని దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు స్థానం ఉండదనే బీజేపీ తీరు తేటతెల్లం అయిందని, అందుకే తాను పార్టీని వీడుతున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు శ్రవణ్ ఘాటు లేఖ రాసారు.