జంటనగరాల్లో నివసించే పేదల బస్తీల రూపురేఖలను మారుస్తామని, దళితవాడల్లో దారిద్ర్యాన్ని, పేదరికాన్ని పారదోలడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ కాలనీలో ఇళ్ళు ఏ క్షణాన్నైనా కూలిపోయేలా ఉండటంతో సోమవారం స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీవాసులతో కలిసి సీఎం కేసీఆర్ ను కలిసి పరిస్థితిని వివరించారు. ఇళ్ళ ఫొటోలను సీఎంకు చూపించగా స్వయంగా కాలనీకి వచ్చి పరిశీలిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి అదేరోజు సాయంత్రం ఐడీహెచ్ ఆరు కాలనీలను సందర్శించారు.
అక్కడి సమస్యలను చూసి స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీవాసులపై వరాలజల్లు కురిపించారు. శిధిలావస్థకు చేరుకున్న భవనాల్లో ప్రాణాలు అరచేతపెట్టుకుని బతుకు సాగించడం దారుణమని, వచ్చే ఐదు నెలల్లో 60 గజాల స్థలంలో రూపాయి ఖర్చు లేకుండా ఐడీహెచ్ కాలనీలో నివాసముంటున్న ప్రతి ఒక్కరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదవాళ్ళు ఎక్కడైనా నివాసముంటే బుల్ డోజర్లు పెట్టి కూల్చేశారని, ధనవంతులు ప్రభుత్వ భూములు కబ్జాచేస్తే వాటిని క్రమబద్ధీకరించి కాపాడాయని గత ప్రభుత్వలనుద్దేశించి మాట్లాడారు. శిధిలావస్థలో ఉన్న భవనంలో నివసించే వారు వెంటనే ఖాళీ చేయాలని, పార్క్, దేవాలయం, మార్కెట్, దుకాణాలతో కాలనీని నిర్మించి ఇస్తామని, ఏ అధికారైనా ఒక్క రూపాయి లంచమడిగినా బేగంపేటలోని సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని అక్కడి ప్రజలకు సూచించారు.