mt_logo

వలసల వెల్లువ

– టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కనకయ్య, మదన్‌లాల్
– మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా గులాబీనీడకు..
– పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్, కేకే..
– కోలాహలంగా మారిన తెలంగాణభవన్
– టీఆర్‌ఎస్‌కు కార్యకర్తలే రథసారధులు: కేశవరావు
– ఇంటిపార్టీలోకి చేరుతున్నవారందరికీ అభినందనలు: డిప్యూటీ సీఎం
– రెండ్రోజుల్లో ఖమ్మం టీడీపీ ఖాళీ: హోంమంత్రి నాయిని

గులాబీ వనానికి మరింత శోభ వచ్చింది. ఇంటిపార్టీ పట్ల ఆకర్షితులైన ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు కోరం కనకయ్య (కాంగ్రెస్-ఇల్లెందు), మదనల్‌లాల్ (వైఎస్సార్సీపీ-వైరా)తోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వెంకట్రావు, యాదవరెడ్డి, రాజేశ్వర్‌రావు సోమవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరితోపాటు ఈ రెండు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గులాబీ నీడకు చేరారు. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు కొత్తగా పార్టీలోకి వస్తున్నవారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు.

ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు తరలిరావడంతో తెలంగాణభవన్ పరిసరాలు గులాబీమయమయ్యాయి. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ మీ అందరిదీ. ఇక్కడ అందరూ ప్రధానమే. పార్టీకి కార్యకర్తలే రథసారధులు. మనందరం ఐక్యంగా ముందుకు వెళదాం. బంగారు, నవ్య తెలంగాణ సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. పార్టీని బలోపేతం చేయడంద్వారా మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాకారం అవుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. వివిధ పార్టీల నుంచి అందరూ టీఆర్‌ఎస్‌లో చేరడం సొంత ఇంటిలోకి వచ్చినట్లుందన్నారు. టీఆర్‌ఎస్ తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ అన్నారు.

పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి తన దగ్గరే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను ఉంచుకొని వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. బీజేపీ మెదక్ ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని మహమూద్ అలీ అన్నారు. హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఇంతమంది టీఆర్‌ఎస్‌లో చేరినందున ఇది చాలా మంచిరోజుగా అభివర్ణించారు. అరవయ్యేండ్లుగా అనేక కష్టాలు పడినం. ఇప్పుడు బానిస సంకెళ్లు తెంచుకున్నం. కేసీఆర్ కలగంటున్న బంగారు తెలంగాణ సాధించాలంటే పార్టీని బలోపేతం చేయాలి. తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది.

ఇందుకు అందరం కృషి చేయాలి అన్నారు. ఇప్పుడు చేరినవారే కాదు.. చాలామంది టీఆర్‌ఎస్‌లోకి వచ్చేందుకు ఆలోచిస్తున్నారు. రెండ్రోజుల్లో ఖమ్మం టీడీపీ ఖాళీ అవుతుంది. ఇంకా చాలా జిల్లాల నుంచి సమాచారం వస్తున్నది. హైదరాబాద్ నగరంనుంచి రోజూ వేలమంది పార్టీలో చేరుతున్నారు. అందరిలో చైతన్యం వచ్చింది. ఇప్పటివరకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని దూరంచేసి తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడుతున్న కేసీఆర్‌కు మద్దతునివ్వాలి అని చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన హామీలన్నింటినీ ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. పంద్రాగస్టు రోజున దళితులకు మూడెకరాల భూ పంపిణీ మొదలైందని పేర్కొన్నారు. అక్టోబర్ రెండు నుంచి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు.

కేసీఆర్‌పై జనం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు: ఎమ్మెల్సీ వెంకట్రావు
అరవయ్యేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తారని ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతునిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో సింగరేణి చాలా కీలకమైనది. ఇందులో పని చేస్తున్న 62వేల మంది శాశ్వత, 25వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల ఆశల్ని వమ్ము చేయకుండా వీళ్లందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చారు. కొత్త మైన్స్ తెరవాలని ఆదేశించారు. దీని ద్వారా చాలామంది యువతకు ఉపాధి దొరుకుతుంది. నిన్నటిదాకా ఆంధ్ర పార్టీలు తెలంగాణను చిన్నచూపు చూసినయి. మన బతుకులు ఇంకనైనా బాగు పడాలంటే, తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుంది.

ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయాలి: కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు
ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు గిరిజనులు టీఆర్‌ఎస్‌లోకి రావడం శుభపరిణామం. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుంది. ముఖ్యమంత్రి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా విద్యుత్తు ఉత్పత్తిలో కీలకంగా మారనుంది.

దేశంలో అభివృద్ధి రాష్ట్రంగా ఎదుగుతుంది: ఎమ్మెల్సీ రాజేశ్వరరావు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఎస్సీలకు ప్రత్యేక ప్రణాళిక కేటాయించారు. ప్రతి జాతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. బంగారు తెలంగాణ కల సాకారం కావాలంటే అందరం మద్దతునివ్వాల్సిన అవసరముంది. అప్పుడే తెలంగాణ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ముందుంటుంది.

కోలాహలంగా తెలంగాణభవన్
వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతల చేరిక సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం కోలాహలంగా సాగింది. ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భవన్‌కు వచ్చారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు ఎమ్మెల్సీలు వెంకట్రావు, యాదవరెడ్డి, రాజేశ్వరరావు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

కనకయ్యతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఏవీ నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు దుర్గ, ఖమ్మం మహిళా కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీ, పలువురు మార్కెట్ కమిటీ చైర్మన్లు, 30 మంది సర్పంచులు, 35 మంది ఎంపీటీసీలు, 1200 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. మదన్‌లాల్‌తోపాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు కూడా గులాబీ నీడకు వచ్చారు. ఈ కార్యక్రమంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు కవిత, నగేష్, పాటిల్, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు, చీఫ్ విప్ ఓదెలు, ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, ఏనుగు రవీందర్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, ఇంద్రకరణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, జగదీష్, ఆమోస్, సలీం, తదితరులు కూడా పాల్గొన్నారు.

సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవడానికే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాం. ఎవరైతే ఈ ప్రాంత అభివృద్ధికి పట్టుదలతో ఉన్నారో వారినే ప్రజలు గెలిపించారు. కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తారనే పూర్తి విశ్వాసంతోనే వారికి అండగా నిలవాలని ముందుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రం కరెంటు కోతలతో బాధపడుతుంటే, ఏపీలో మాత్రం ఆ బాధలు లేవు. ఇదంతా ఆంధ్ర పాలకుల కుట్ర. ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ అక్కడ పెట్టుకుని సుఖపడుతున్నరు. హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాల అంశంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలి. చేతనైతే వారు గ్రేటర్ ఎన్నికల్లో ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాలి.
– ఎమ్మెల్సీ యాదవరెడ్డి

నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *