mt_logo

సీఎస్ ఎస్.కే. జోషి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కంపా అథారిటీ మొదటి సమావేశం

– అడవులు, పర్యావరణ రక్షణపరంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలవాలి

– ప్రాజెక్టుల కోసం అటవీ భూసేకరణ చేసినచోట ఆదర్శవంతంగా ప్రత్యామ్నాయ అడవుల పెంపకం

– కంపా నిధులతో చేపట్టిన ప్రత్యామ్నాయ అటవీ పెంపకం ప్రాంతాలలో త్వరలో పర్యటన

– ఎన్నికల కోడ్ పేరుతో అమలులో ఉన్న కార్యక్రమాలకు ఆటంకం వద్దు, కొనసాగాలి

– తెలంగాణ కంపా అథారిటీ తొలి సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి

తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించటంతో పాటు, ఇతర అభివృద్ది పథకాలను కొనసాగిస్తోందని, ఇందుకోసం సేకరించిన అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రాంతాల్లో అటవీ పెంపకం యుద్ద ప్రాతిపదికన కొసాగించాలన్నారు చీఫ్ సెక్రటరీ ఎస్.కే. జోషి.

సీఏస్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర స్థాయి కంపా అథారిటీ మొదటి సమావేశం సచివాలయంలో జరిగింది. (CAMPA – ప్రత్యామ్నాయ అటవీ పెంపకం నిధి నిర్వహణ, ప్రణాళిక ఆథారిటీ, Compensatory Afforestation Fund Management and Planning Authority) అథారిటీలో సభ్యులైన అటవీ, ఆర్ధిక, సాగునీటి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

అటవీ, పర్యావరణ రక్షణ పరంగా తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలని చీఫ్ సెక్రటరీ ఆంకాక్షించారు. కాళేశ్వరంతో సహా ఇతర ప్రాజెక్టుల కోసం సేకరించిన అటవీ భూములకు, బదులుగా చేపట్టిన ప్రత్యామ్నాయ అడవుల పెంపకం త్వరితగతిన, సమర్థవంతంగా కొనసాగాలన్నారు. అభివృద్ది కోసం ప్రాజెక్టులు నిర్మిస్తే, పర్యావరణ సమతుల్యత కోసం అడవులను రక్షించుకోవాలని అందుకే ముఖ్యమంత్రి జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం ఇచ్చారని తెలిపారు. ప్రాజెక్టుల వారీగా ఎంత అటవీ భూమి సేకరించారు, అక్కడ ప్రత్యామ్నాయంగా కంపా నిధులతో చేపట్టిన పనులపై ప్రత్యేకంగా బుక్ లెట్లు తయారు చేయాలని చీఫ్ సెక్రటరీ సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల అటవీ, పర్యావరణ అనుమతుల కోసం అటవీ శాఖ అధికారులు చాలా కష్టపడ్డారని, రికార్డు సమయంలో కేంద్ర అనుమతులు సాధించారని ప్రశంసించిన సీ.ఎస్, అడవుల పెంపులో కూడా ఇదేరకమైన చొరవ చూపాలని కోరారు. కంపా నిధులతో చేపట్టిన వివిధ పథకాలపై అదనపు అటవీ సంరక్షణ అధికారి లోకేష్ జైస్వాల్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కేంద్రం నుంచి 664 కోట్ల కంపా నిధులు వస్తే, 645 కోట్లను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కంపా నిధులతోనే అటవీ భూముల చుట్టూ రక్షణ కోసం కందకాల తవ్వకం, గట్లు, కట్టల స్థిరీకరణ కోసం గచ్చకాయ చెట్లను పెద్ద ఎత్తున పెంచుతున్నామన్నారు. ప్రత్యామ్నాయ భూముల్లో మొక్కలు బతికే శాతం పెంచేందుకు కనీసం రెండు మీటర్ల ఎత్తు, రెండేళ్ల వయసు ఉన్న అటవీ జాతి మొక్కలను నాటుతున్నట్లు అదనపు అటవీ సంరక్షణ అధికారి ఆర్. శోభ తెలిపారు. అడవులపై వివిధ రకాలుగా పడుతున్న ఒత్తిడిని తగ్గించాలని, జీవనోపాధి కోసం అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారికి అడవి బయటే ఉపాధి మార్గం కల్పించే మార్గాలను అన్వేషించాలని ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ సూచించారు.

సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, పీసీసీఎఫ్ పీ.కే.ఝా, పృధ్వీరాజ్, కేంద్ర అటవీశాఖ ప్రతినిధి ఎం.ఆర్.జీ. రెడ్డి, ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేష్ దత్ ఎక్కా, ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, అదనపు పీసీసీఎఫ్ మునీంద్ర, స్వర్గం శ్రీనివాస్, సాగునీటి, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *