mt_logo

రాష్ట్రంలో కోతుల బెడద నివారణపై సమావేశం

రాష్ట్రంలో కోతులతో తలెత్తుతున్న సమస్యలు, అడవి పందుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉండి రైతులు, సామాన్య ప్రజానీకం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో కోతుల బెడద నివారణకై చేపట్టాల్సిన చర్యలు సూచించాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో తెలంగాణలో కోతుల బెడద నివారణకై కోతులకు సంతాన నిరోధక ఆపరేషన్ల నిర్వహణ, కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటు, ఆపరేషన్ నిర్వహణ కేంద్రాల ఏర్పాటు, ఆపరేషన్ల నిర్వహణకు తగిన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కోతుల బెడద నివారణపై చేపట్టాల్సిన చర్యలపై సూచనకై అటవీ, వెటర్నరీ, వ్యవసాయ శాఖల నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ ప్రాక్తీస్ లపై అధ్యయనం చేసి తగు ప్రతిపాదనలు వారం రోజుల్లోగా సమర్పించాలని కమిటీని సీఎస్ కోరారు. కోతుల నుండి తమ పంటలను కాపాడుకోడానికి రైతులు పలు సాంప్రదాయక విధానాలు పాటించేలా వారిని చైతన్య పరచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రవీణ్ రావు, వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డా.రవీందర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ లతోపాటు పలువురు ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *