mt_logo

తెలంగాణ సాధించిన కీర్తి చాలు – కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం జూన్ రెండున ఆవిర్భవించనుందని తెలిసీ సీమాంధ్ర నేతలు చేస్తున్న విఫల ప్రయత్నాలు యావత్ తెలంగాణ సమాజం నవ్వుకునేలా చేస్తున్నాయని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. “తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. ఈ జన్మకు ఈ కీర్తి చాలు. చిరునవ్వుల తెలంగాణ చూడటం కోసమే నేను ఉంటాన”ని కేసీఆర్ అన్నారు. సీమాంధ్ర నేతలు 35 మంది ఎంపీలను గెలిపిస్తే మళ్ళీ విలీనం చేయిస్తామని అంటున్నారని, వాళ్ళ మాటలు వింటే మన పోరాటం ఆగిపోలేదని, ఇంకా మిగిలిపోయే ఉందని అనిపిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ మహబూబాబాద్ ఇన్చార్జి నెహ్రూనాయక్, ఆయన భార్య తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలో పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డిలు పెట్టబోయే కొత్త పార్టీలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చింది కదాని సంబరపడితే సరిపోదని, ఎంతోమంది మాయామశ్చీంద్రులు వచ్చి కథలు చెప్తారని, ఈ సమయంలో కూడా మోసపోతే మంచిదికాదని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఢిల్లీని చూసుకునేందుకు చాలా మంది ఉన్నారు. మన సంగతి ఏంటి? కొత్త రాష్ట్రం ఏర్పడింది. బాగుపడొద్దా? పైకి రావొద్దా? కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్ లు కొత్త పార్టీలు పెడతారంట. పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదు. చిరంజీవి తమ్ముడని అన్నారు. అప్పుడు  అన్నదైపోయింది. ఇప్పుడు తమ్ముడు వంతా? ఎవడెవడో వస్తే ఎట్లా? సంక్రాంతి పండగప్పుడు గంగిరెద్దోళ్ళు వస్తారు. ఇప్పుడు కూడా వస్తారు. మోసపోవద్దు. కష్టపడి సాధించుకున్నాం. అనేక మంది బలిదానాలు చేశారు. అనేక పోరాటాలు జరిగాయి. ఉస్మానియా విద్యార్థులు లాఠీ దెబ్బలు, పోలీస్ కేసులు ఎన్నో భరించారు. నవ్వేటోని ముందు జారిపడొద్దు.” అని కేసీఆర్ ప్రజలను చైతన్యపరిచారు. యుద్ధం చేసేవాడి చేతిలోనే కత్తిపెట్టాలని, కత్తితిప్పడం వచ్చినోడే బ్రహ్మాండంగా యుద్ధం చేసి మనకు కావాల్సిన పనులు చేసిపెడతాడని, మతితప్పి సినిమా యాక్టర్లను చూసి మోసపోతే మనం ఆగం అయిపోతామని హెచ్చరించారు. ఎవరెట్ల కొట్లాడారో చూసాం. ముందుండి పనిచేసినవారిని చూసాం. అలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పేర్కొన్నారు. చంద్రబాబు ఇంతజరిగినా తెలంగాణలో వాళ్ళ పాలనే వస్తుంది అంటున్నాడు. ఎలా సాధ్యం? తెలంగాణ వచ్చేదాకా అడ్డుకున్నాడు. ఇంకా తెలంగాణలో ఏమొహం పెట్టుకుని రాజకీయాలు చేస్తాడు? ఆంధ్రా పార్టీలు మనకొద్దని, ఆంధ్రా పార్టీలు మనను పట్టించుకోవని కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లో చేరేవారికి పని ఎక్కువని, సమయం సరిపోదని, ఎన్నో కలలు, ఆశలున్నాయని, వాటిని నెరవేర్చాలంటే టీఆర్ఎస్ కే సాధ్యం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *