mt_logo

పదమూడేళ్ళలోపు సర్వీసుంటే వెళ్ళాల్సిందే

తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన ప్రక్రియ షురూ అయ్యింది. ఇన్నాళ్ళూ అక్రమంగా తెలంగాణలో ఉద్యోగం పొందిన సీమాంధ్ర ఉద్యోగులు నేటివిటీ ఆధారంగా సొంత రాష్ట్రానికి వెళ్ళక తప్పని పరిస్థితి. కేంద్రప్రభుత్వం నియమించిన కమల్ నాథన్ కమిటీ గురువారం హైదరాబాద్ కు చేరుకుంది. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో సమావేశమై ఉద్యోగుల విభజనపై అనుసరించాల్సిన విధానాన్ని చర్చించారు. 13 ఏళ్ళు ఎక్కడ పని చేసినవారిని అక్కడే ఉంచాలని, అంతకంటే తక్కువకాలం పనిచేసినవారిని నేటివిటీ ఆధారంగా వారి సొంత రాష్ట్రానికి పంపించాలని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పదేళ్లవరకు ఉంటున్నందున పదేళ్ళలో రిటైర్ అయ్యే ఉద్యోగులకు మాత్రమే ఆప్షన్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కమిటీ సభ్యులు అన్ని వివరాలనూ ప్రభుత్వ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు విభజన ఉండదని, స్టేట్ కేడర్ పోస్టులకే విభజన ఉంటుందని అన్నట్లు సమాచారం. 76 వేల రాష్ట్ర కేడర్ పోస్టుల్లో 53 వేలమంది ఉద్యోగుల సమాచారమే ప్రభుత్వం వద్ద ఉందని, మిగతా 23 వేల పోస్టులకు సంబంధించి ఉద్యోగుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని మహంతి కమిటీ సభ్యులకు తెలిపారు. సచివాలయంలో ఉద్యోగుల విభజన మాత్రమే ఉంటుందని, బదిలీలు ఉండవని సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *