mt_logo

తెలంగాణ ఆకాంక్షను ఎత్తుకున్న కామ్రేడ్లు!

By: – ఆకుతోట ఆదినారాయణ

పోరాటాలు, ఉద్యమాలు కమ్యూనిస్టులకు కొత్తేమీ కావు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో చరిత్రాత్మక పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనతను మూటగట్టుకున్న చరిత్ర వారిది. సాయుధ రైతాంగంలో మడమ తిప్పని ఉద్యమకారులై.. నిజాం నవాబు బూజు వదిలించిన ఎర్రసైన్యమై కదం తొక్కిన వారసుల్లా నేటి తెలంగాణ ఉద్యమానికి అగ్ని కణాలై ఎగసిపడాల్సిన అనివార్యత ఉంది. పేదలకు భూములు పంచినా, ప్రజా సమస్యలపై ఎర్రజెండా బావుటా ఎగరేసినా, పెట్టుబడి, సామ్రాజ్యవాదుల్లో వణుకు పుట్టించినా వారికి వారే సాటి. ఇంతటి త్యాగాలు, విశిష్ట చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ చారిత్రక తెలంగాణ ఉద్యమానికి సంచలన కేంద్ర బిందువు కావాలి. ఉద్యమాలు, పోరాటాల పట్ల కొడవలి మొద్దు బారకుండా ఎప్పటికప్పుడు పదునుపెట్టే సీపీఐ అణగారిన వర్గాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన సమస్య తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించిన సీపీఐ వైఖరి పట్ల తెలంగాణవాదులు హర్షిస్తున్నారు. వారి ఎర్రజెండాకు తెలంగాణ ప్రజలు వేన వేల వందనాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు మొదటి నుంచి భాషావూపయుక్త రాష్ట్రాలకే మొగ్గు చూపుతున్నప్పటికీ అణగారిన తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్లను ప్రత్యక్షంగా చవిచూసిన సీపీఐ తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టడాన్ని నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారు.

ఒక వామపక్ష పార్టీ చిత్తశుద్ధితో ఉద్యమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తే ఎన్ని సత్ఫలితాలిస్తాయో చరిత్ర చెబుతోంది. పార్టీ సంస్థాగత నిర్ణయాల మేరకు ప్రతి మూడేళ్ల కొకసారి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా సాగేదే. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో సమస్య అంటూ ఉందంటే అది తెలంగాణ సమస్యే. నేడు ఉద్యమం పరాకాష్ట దశలో ఉంది. ఈదశలో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించే పార్టీల్లో సీపీఐ ఒకటి. తెలంగాణ ఉద్యమాల కేంద్ర బిందువు, తెలంగాణ గుండెకాయ కరీంనగర్‌లో ఈనెల 21-24 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం తెలంగాణపై ఆ పార్టీకున్న అవ్యాజ్యమైన మక్కువను చాటుతోంది. తెలంగాణ విషయంలో మరో వామపక్ష పార్టీ సీపీఎం మొండి కొడవలి చూపించింది. సీమాంధ్ర నాయకులను నేతలను ఒప్పించి, మెప్పించి సామాజిక సమస్య పట్ల తన ఎర్రజెండాను ఎగరేసిన సీపీఐ నిర్ణయం చరిత్రాత్మకం. ఆదర్శ సిద్ధాంతాలను వల్లించే సీపీఎం ప్రజా సమస్యలకు దూరంగా పారిపోవడాన్ని మార్క్సిస్టు సూత్రీకరణకే మచ్చ తెచ్చింది. ఖమ్మంలో ఇటీవల నిర్వహించిన సీపీఎం మహాసభలో తెలంగాణ అంశాన్ని లేవనెత్తకుండా ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రధాన సమస్యను వదిలేసింది. తమ గొయ్యిని తామే తవ్వుకున్న మార్క్సిస్టు పార్టీ మహాసభ వ్యవహరించిన తీరు వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉనికినే కోల్పేయే పరిస్థితులు వచ్చాయి. దీనికి తోడు ఉద్యమాల కు ఆయువుపట్టుగా వ్యవహరించాల్సిన పార్టీ నేతలే ఉద్యమాలకు దూరంగా పారిపోయే స్వభావాన్ని సభలో చాటి చెప్పడం వారి నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఈ మహాసభలో తెలంగాణ అంశాన్ని చర్చించకపోగా, ఉద్యమంపై సీపీఎం నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మార్క్సిస్టులు ఈ తీరును పరిశీలించి, వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి వ్యవహరించాలి.

1946 నుంచి భాషావూపయుక్త రాష్ట్రాలకే కట్టుబడి ఉన్న సీపీఐ, 1969 ఉద్యమంలో తెలంగాణకు మద్దతు ఇవ్వలేకపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు, లేదంటే ప్రత్యేక ప్యాకేజీల డిమాండ్‌కే పరిమితమైంది. అయితే అణగారిన ప్రజల సమస్యను అవగాహన చేసుకుని జనవరి 200లో తిరుపతిలో నిర్వహించిన 23వ రాష్ట్ర మహాసభలో తెలంగాణ సమస్యపై సానుకూలంగా తీర్మానం చేసి, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించింది. ఈప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక రాష్ట్రమే శరణ్యమని తేల్చింది. దీనికి మించి మరే ప్రత్యామ్నాయం లేదని తేటతెల్లం చేసింది. పార్టీ జాతీయ కార్యదర్శి ఏబీ బర్దన్, జాతీయ నాయకులు రాజా, సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు తీసుకున్న నిర్ణయాలు పార్టీ విలువలను మరింత పెంచారు. దీన్ని సీమాంధ్ర కామ్రేడ్లు వ్యతిరేకించినా, దోపిడీకి వ్యతిరేకంగా సరైన నిర్ణయం తీసుకుని తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది. ఔనన్నా.. కాదన్నా సీమాంధ్ర నాయకులను ఒప్పించి, మెప్పించిన రాష్ట్ర నాయకత్వం ఈప్రాంత ప్రజలకు ఉద్యమ దివిటీగా నిలిచింది.

ఆ రాష్ట్ర మహాసభలో తీర్మానించిన నిర్ణయానికి 200 మార్చిలో హైద్రాబాద్‌లో నిర్వహించిన జాతీయ మహాసభ ఆమోదముద్ర వేసింది. ఈసభలో ఆ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించాల్సిన ఆవశ్యకతను చాటి చెప్పారు. ఉద్యమం కోసం నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆధిపత్యాన్ని, అరాచాకాన్ని దుయ్యబట్టింది. దశాబ్దాల కాలంగా తెలంగాణపై జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దోపిడీని ఎండగట్టింది. నిధులు, నీళ్లు, భూములు, వనరులు, ఖనిజాలు, ఉద్యోగాలతో పాటు తెలంగాణలో వెనుకబడిన అన్ని రంగాలలో తెలంగాణకు జవసత్వాలివ్వడానికి ఒక ప్రధాన అంగంగా పనిచేయడానికి వచ్చిన పార్టీ ఎర్రజెండా తెలంగాణ ఉద్యమ రంగు పూసుకుని మరింత ఎర్రబారింది.

మరోసారి 2010లో హైద్రాబాద్‌లో రాష్ట్ర సమితి ప్రత్యేక సమావేశం నిర్వహించి తెలంగాణ కోసం క్రియాశీలక ఉద్యమాలు చేయాలని తీర్మానించింది. ఉద్యమంలో క్రియాత్మకంగా పాల్గొంటున్న టిఆర్‌ఎస్, బీజేపీ, న్యూడెమోక్షికసీలకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. ఇందుకోసం పలు ఆందోళనా కార్యక్రమాలు చేపట్టింది. సీపీఐ చేపట్టిన కార్యక్రమాలు ఇక్కడి ప్రజల మనసుల్లో శాశ్వత ముద్ర వేశాయి. పార్టీ చేపట్టిన పలు ఆందోళనా కార్యక్షికమాల్లో భాగంగా కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు తెలంగాణ వచ్చే దాకా వదలనని నిరాహార దీక్ష చేపట్టి పార్టీ ఉడుంపట్టును, త్యాగనిరతిని చాటారు.

తెలంగాణ సాధన పేరుతో 2011 జులైలో హైద్రాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఉద్యమ తీవ్రతను చాటారు. తెలంగాణకు అన్యాయం చేస్తే, సీమాంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలికే పాలకవర్గాలు, రెండు కళ్ల సిద్ధాంతం వల్లించే టీడీపీలకు నూకలు చెల్లుతాయని సీపీఐ మహాసభ హెచ్చరించాలి. తెలంగాణ సింగాలై గర్జించి ఢిల్లీ పీఠానికి కుదుపు తేవాలి. గ్రామగ్రామానా వాడవాడల్లో “తెగిస్తేనే తెలంగాణ” అనే నినాదాన్ని మరింత తీసుకుపోయే బాధ్యతను భుజానేసుకోవాలి.

ఈ ప్రాంత ప్రజల ఘోషను అర్థం చేసుకోవడంలో ఆలస్యమైనప్పటికీ ఉద్యమ పంజా విసరడంలో సీపీఐ తన సత్తాను చాటాలి. తెలంగాణను బలపర్చే సీమాంధ్ర నాయకులను కూడా కూడగట్టి ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి. పార్టీ మహాసభలో తెలంగాణ కోసం చేపట్టే ఆందోళనా కార్యక్రమాలను చర్చించాలి. ఉద్యమంలో అగ్రభాగాన నిలబడే పార్టీలతో జతకట్టి సంఘటిత శక్తిగా తెలంగాణ జయకేతనమై మరింత ఎరుపుదనాన్ని పులుముకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుని తెగిస్తే ప్రజలు తమ గుండెలను పల్లకీలుగా చేసుకుని పార్టీని ఊరేగిస్తారనేది మర్చిపోకండి కామ్రేడ్స్!.

నమస్తే తెలంగాణ నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *